Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆలయ పూజారుల జీతాలపై పిల్.. విచారణకు సుప్రీంకోర్టు నో

ఆలయ పూజారుల జీతాలపై పిల్.. విచారణకు సుప్రీంకోర్టు నో

ఢిల్లీ, 18 మే (హి.స.)

దేశవ్యాప్తంగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, సేవాదార్లు, ఇతర సిబ్బందికి ఏకరీతి వేతనాలు, సంక్షేమ ప్రణాళికను రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే... న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఈ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఆధీనంలోని ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, సిబ్బంది వేతనాలు, సేవా నిబంధనలను సమీక్షించేందుకు జ్యుడీషియల్ కమిషన్ లేదా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన తన పిటిషన్లో కోరారు. వేతనాల కోడ్ 2019లోని సెక్షన్ 2(కే) ప్రకారం పూజారులను, ఆలయ సిబ్బందిని 'ఉద్యోగులు'గా గుర్తించి, వారికి కనీస వేతనం, ఇతర కార్మిక సంక్షేమ రక్షణలు కల్పించాలని అభ్యర్థించారు.

ప్రభుత్వాలు ఆలయాలపై పరిపాలన, ఆర్థిక నియంత్రణ చేపట్టినప్పుడు ప్రభుత్వానికి పూజారుల మధ్య యజమాని-ఉద్యోగి సంబంధం ఏర్పడుతుందని పిటిషనర్ వాదించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో పూజారులు, సిబ్బంది కేవలం రూ.1,000 నుంచి రూ.5,000 మధ్య ఉన్న నామమాత్రపు గౌరవ వేతనాలు, దక్షిణలపై ఆధారపడి జీవిస్తున్నారని, వారికి పెన్షన్, ఆరోగ్య సంరక్షణ వంటి సామాజిక భద్రత కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఆలయాల నియామకాలు, ఆదాయంపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటూ, అక్కడి సిబ్బందికి కార్మిక సంక్షేమ ప్రయోజనాలు నిరాకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 కింద కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ఆయన వాదించారు.

అయితే, ధర్మాసనం ఈ పిల్ విచారణకు విముఖత వ్యక్తం చేయడంతో సంబంధిత అధికారులను ఆశ్రయించేందుకు స్వేచ్ఛనిస్తూ పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలని అశ్విని ఉపాధ్యాయ్ కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. పిటిషనర్ ఉపసంహరించుకున్న కారణంగా ఈ వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu