Dailyhunt
అమరావతి కల సాకారం.. రాష్ట్రపతి ఆమోదం పై లోకేశ్ భావోద్వేగ ట్వీట్

అమరావతి కల సాకారం.. రాష్ట్రపతి ఆమోదం పై లోకేశ్ భావోద్వేగ ట్వీట్

అమరావతి, 07 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత పదేళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠ కి తెరపడింది. అమరావతిని రాష్ట్ర ఏకై, శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటు ఆమోదించిన 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026 కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఆమోదముద్ర వేశారు.

సోమవారం (ఏప్రిల్ 6) రాత్రి కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ను కూడా విడుదల చేసింది. ఈ చారిత్రాత్మక పరిణామంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పంచుకున్నారు.

ఈ రోజు ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఒక చారిత్రాత్మక దినం. గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం-2026 కు ఆమోదం తెలపడంతో, మన రాజధాని కల అధికారికంగా నిజమైంది అని లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం దార్శనికతతో మద్దతు అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అమరావతి రైతులకు సెల్యూట్

ముఖ్యంగా అమరావతి కోసం భూములిచ్చి, గత ఐదేళ్లుగా అనేక కష్టాలను ఓర్చి పోరాడిన రైతుల త్యాగాన్ని లోకేశ్ కొనియాడారు. అమరావతి రైతుల సహనం, త్యాగం, నిబద్ధత వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. వారికి నా ప్రత్యేక సెల్యూట్. మనమందరం కలిసి ఈ విజయాన్ని సాధించాం అని ఆయన ట్వీట్ చేశారు. ఈ చట్టం అమల్లోకి రావడంతో, 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2) సవరించబడింది, దీని ప్రకారం ఇకపై అమరావతి ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధానిగా చట్టబద్ధత పొందింది. ఈ విజయం రాష్ట్ర అభివృద్ధికి పునాది అని లోకేశ్ ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu