
నంద్యాల, 02 జూన్ (హి.స.)
చాగలమర్రి మండలానికి చెందిన లక్ష్మి ధన్సిక అనే చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ (స్టెమ్ సెల్ థెరపీ) చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం పట్ల జిల్లా కలెక్టర్ జి.
రాజకుమారి హర్షం వ్యక్తం చేశారు. పీజిఆర్ఎస్ హాలులో చిన్నారి చికిత్స కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.22 లక్షల ఆర్థిక సహాయ ఉత్తర్వులను కలెక్టర్ చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందే ప్రతి వినతిని సానుకూల దృక్పథంతో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. చిన్నారి ఆరోగ్యంగా కోలుకుని మంచి భవిష్యత్తుతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అలాగే, శస్త్ర చికిత్సలో భాగంగా అవసరమయ్యే బోన్ మ్యారో కణాలను చిన్నారి తండ్రి నుంచి సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు తమ కూతురి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, తమ సమస్యను వెంటనే గుర్తించి సహకరించిన జిల్లా కలెక్టర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ సహాయం బాధిత కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందని, ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఇది మరో నిదర్శనమని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

