Dailyhunt
డంపింగ్ యార్డ్ రద్దు చేసే వరకు పోరాటం : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

డంపింగ్ యార్డ్ రద్దు చేసే వరకు పోరాటం : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్, 05 ఏప్రిల్ (హి.స.) హుజూరాబాద్ ప్రజల ఆరోగ్యం కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు.. వివాదాస్పద డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగే ప్రసక్తే లేదు అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

పట్టణ శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆర్య వైశ్య వర్తక సంఘం నాయకులు చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారం నాటికి 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ నిరసన దీక్షా శిబిరం కౌన్సిలర్ గందే శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఆర్యవైశ్య వర్తక సంఘం నాయకులు దీక్షలో కూర్చోగా.. వారికి మద్దతుగా కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఐదు ప్రధాన కార్యాచరణలను ప్రకటించారు. ప్రజల పక్షాన పోరాడేందుకు ఈ నెల 7, 8 తేదీలలో తాను స్వయంగా రెండు రోజుల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం ఒక పార్టీ పోరాటం కాదని, అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రేపు బీజేపీ చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి తాను స్వయంగా హాజరవుతానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్లతో పాటు కాంగ్రెస్ నేతలను కూడా కలుపుకొని వెళ్తానని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డ్ వల్ల కలిగే పర్యావరణ ముప్పు, ఆరోగ్య సమస్యల గురించి వీడియోల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ మెడలు వంచేలా పక్కా కార్యాచరణ రూపొందించాలని నాయకులను కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu