Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

దేశంలో.అనేక.రాష్ట్రాలు ఎండలు. వడగాల్పులతో. ఉక్కిరిబిక్కిరి

విశాఖపట్నం, 21 మే (హి.స.)

దేశంలో అనేక రాష్ట్రాలు ఎండలు, వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. భానుడి భగభగలతో రాష్ట్రం కూడా నిప్పుల కొలిమిలా మారింది.

ఈ నెల 24వ తేదీ వరకు అనేక రాష్ట్రాల్లో (ఏపీలో కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలో పలు ప్రాంతాలు) వడగాడ్పులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బుధవారం రాష్ట్రంలో ఎండ ఠారెత్తించింది. ఈ వేసవి సీజన్లోనే అత్యధికంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురంజిల్లా నందనమారెళ్లలో 46.1, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 46, బాపట్ల జిల్లా కొల్లూరు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 45.9, ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 45.7, ప్రకాశం జిల్లా కొండపిలో 45.6, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 45.5, నెల్లూరు జిల్లా గూడూరులో 45.4, పోలవరం జిల్లా కూనవరంలో 45, గుంటూరు జిల్లా పాండ్రపాడులో 44.8, కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 44.5, అనకాపల్లి జిల్లా మాకవరపాలెలం, తిరుపతి జిల్లా పూలతోటలో 44.4, విశాఖ జిల్లా ములగాడలో 43.6, కాకినాడ జిల్లా కాజులూరులో 43.5, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా, రాయలసీమల్లోని 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీర ప్రాంతాల్లో అనేక చోట్ల 40 డిగ్రీల మార్కు దాటింది. మార్కాపురం జిల్లాలో 12 మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. రానున్న నాలుగు రోజులు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu