Dailyhunt

ఏప్రిల్ 10 నుండి టోల్ ప్లాజాల వద్ద 'నో క్యాష్': కేంద్రం సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: 07 ఏప్రిల్ (హి.స.)

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్ 10, 2026 నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు (Cash) చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇకపై టోల్ గేట్ల వద్ద కేవలం ఫాస్టాగ్ (FASTag) లేదా UPI ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల వల్ల ఏర్పడుతున్న భారీ ట్రాఫిక్ జామ్లను నివారించడానికి, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపుల ద్వారా వాహనాలు వేగంగా ముందుకు సాగేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది.

ఏప్రిల్ 10 తర్వాత టోల్ బూత్లలో నగదు తీసుకునే కౌంటర్లు ఉండవు.వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా లేదా అందులో బ్యాలెన్స్ లేకపోయినా, UPI ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే, అటువంటి వారు సాధారణ టోల్ ధర కంటే 25 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

గతంలో ఐడెంటిటీ కార్డులు చూపించి టోల్ మినహాయింపు పొందే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అర్హత ఉన్న వారు తప్పనిసరిగా 'ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్' (Exempted FASTag) పొందాలని స్పష్టం చేసింది. ఒకవేళ టోల్ చెల్లించకుండా వెళ్తే 'వాహన్' (VAHAN) పోర్టల్లో ఆ వాహనాన్ని బ్లాక్లిస్ట్ చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఇన్సూరెన్స్ రిన్యువల్ లేదా వాహనం అమ్మకం సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

వాహనదారులు తమ ఫాస్టాగ్ వాలెట్లలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలని లేదా UPI యాప్లను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu