Dailyhunt

హైదరాబాద్ కు భారీ బస్ టర్మినల్

హైదరాబాద్, 05 ఏప్రిల్ (హి.స.)

హైదరాబాద్ నగర వ్యవస్థను ఆధునికీకరించే దిశగా టీజీఎస్ఆర్టీసీ కీలక అడుగు వేస్తోంది. జీడిమెట్ల సమీపంలోని గాజులరామారంలో 100 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

నగరంలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సుల వల్ల తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ఈ టెర్మినల్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం ఇటీవలే టీజీఎస్ఆర్టీసీకి 100 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ స్థలంలో అంతర్రాష్ట్ర, సిటీ బస్సుల కోసం వేర్వేరు టెర్మినల్స్ నిర్మించనున్నారు. ఇందులో భాగంగా సుమారు 30 ఎకరాలను అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల కోసం, మరో 20 ఎకరాల్లో ఆధునిక సౌకర్యాలు, షాపులతో కూడిన సిటీ బస్ టెర్మినల్ నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడి నుంచే నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడపనున్నారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 10 ఎకరాల్లో ఎలక్ట్రిక్ బస్సు డిపో, 15 ఎకరాల విస్తీర్ణంలో ఈవీ బస్సుల కోసం ప్రత్యేక చార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ బృహత్ ప్రణాళిక పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే హైదరాబాద్ శివారు ప్రాంతం నుంచి నగర రవాణా వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu