
కాకినాడ , 22 అక్టోబర్ (హి.స.)కాకినాడ జిల్లా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దైవదర్శనం కోసం ప్రయాణం సాగిస్తున్న భక్తులు ప్రమాదానికి గురై మృతి చెందడం తనను కలచివేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో నెలకొన్న విషాదం పట్ల సానుభూతి తెలిపారు.
దుర్గమ్మ దర్శనం కోసం వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని సీఎం పేర్కొన్నారు. ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులు ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, చికిత్సలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్

