Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్ణాటకలో హిజాబ్పై నిషేధం ఎత్తివేత.. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం

కర్ణాటకలో హిజాబ్పై నిషేధం ఎత్తివేత.. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం

బెంగళూరు, 14 మే (హి.స.)

కర్ణాటకలోని పాఠశాలల్లో హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులు హిజాబ్తో పాటు జనివారం, తలపాగా వంటి మత, సంప్రదాయ చిహ్నాలను ధరించేందుకు అనుమతినిచ్చింది.

ఈ మేరకు 2022లో గత బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నిషేధ ఉత్తర్వులను రద్దు చేసింది.

విద్యాశాఖ ఖరారు చేస్తున్న కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు తమ యూనిఫాంతో పాటు జనివారం, తలపాగా, రుద్రాక్ష, శివధార, హిజాబ్, స్కార్ఫ్ వంటివి ధరించి తరగతులకు, పరీక్షలకు హాజరుకావచ్చు. విద్యాసంస్థల్లో క్రమశిక్షణతో పాటు, విద్యార్థుల మత, సాంస్కృతిక పద్ధతులకు గౌరవం ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఈ నిర్ణయంపై విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప మాట్లాడుతూ పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ఏప్రిల్ 24న ఒక విద్యార్థి జనివారాన్ని పరీక్ష హాలులో బలవంతంగా తీయించిన ఘటన తర్వాత దీనిపై చర్చ జరిగిందని ఆయన వివరించారు. సంప్రదాయ, మతపరమైన ఆచారాల వల్ల పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. అందుకే ఈ మార్గదర్శకాలు రూపొందించాం అని ఆయన అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు.

2022లో కొందరు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు రావడంపై అభ్యంతరాలు రావడంతో అప్పటి బీజేపీ ప్రభుత్వం యూనిఫామ్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు కూడా ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థిస్తూ, హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరి మతపరమైన ఆచారం కాదని తీర్పు ఇచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu