పుట్టపర్తి, 15 మే (హి.స.)
: ఎన్డీఏను గెలిపించినందుకు రుణం తీర్చుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)అన్నారు. పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఐదో తరం యుద్ధ విమానాలను తయారు చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేశ్ మాట్లాడారు.
'కరవు నేలపై కార్లు తయారీ పరిశ్రమలు తీసుకొచ్చిన మూడు అక్షరాల వ్యక్తి సీబీఎన్. ఫైటర్ జెట్లు తయారీ పరిశ్రమలు ఈ ప్రాంతానికి తెచ్చిన వ్యక్తి సీబీఎన్. ఒకప్పుడు పుట్టపర్తిలో కనీసం వంద ఇళ్లు కూడా లేవు. ఇప్పుడు ప్రపంచానికే అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి మారింది. 1991లో సత్యసాయిబాబా ఎయిర్పోర్టు నిర్మిస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. సత్యసాయిబాబా విజన్ను ఇప్పుడు చూస్తున్నాం. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్లే రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు. దేశంలో నమో అంటే నరేంద్రమోదీ.. ఏపీలో నాయుడు, మోదీ జోడీ. ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు.. ముగ్గురికీ 75 ఏళ్లు అయినా.. 25 ఏళ్ల కుర్రాళ్లలా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగుతోంది. త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోంది. రాయలసీమ ప్రాంతం మరింత అభివృద్ధి కాబోతోంది. 23 నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చూపించాం'' అని లోకేశ్ అన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
