
కరీంనగర్, 05 మే (హి.స.)సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు.
మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపై రేవంత్ మళ్లీ వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. 'కేసీఆర్తో బేరం కుదరలేదా. ఢిల్లీకి మూటలు సరిగా ముట్టడం లేదా. అన్ని కేసులను సీబీఐకి ఎందుకు అప్పగిస్తారు' అంటూ మండిపడ్డారు.
రైతులు ఏడుస్తున్నారని.. వారి విషయంలో ప్రభుత్వానికి మానవత్వం లేదని కేంద్ర మంత్రి విరుచుకుపడ్డారు. ఎంతమంది చనిపోతే రేవంత్ రెడ్డి కళ్లు చల్లబడతాయంటూ వ్యాఖ్యానించారు. కొనుగోళ్లు వెంటనే జరపాలని.. కోత పెడితే ఊరుకోమని హెచ్చరించారు. ప్రధాని మోదీ వస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవన్నారు. మోదీని చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నారంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్

