Dailyhunt

కిక్కిరిసిపోతున్న తిరుమల

తిరుమల, 07 ఏప్రిల్ (హి.స.)

తిరుమల కొండకు వాహనాలు క్యూ కడుతున్నాయి. గడచిన 3రోజుల్లో దాదాపు 33 వేల వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి. చాలామంది భక్తులు సొంత వాహనాల్లోనే తిరుమలకు వస్తున్న క్రమంలో నిత్యం అలిపిరి చెక్పాయింట్ వాహనాలతో కిక్కిరిసిపోతోంది.

గరుడ సర్కిల్ నుంచి తనిఖీ కేంద్రం వరకు బంపర్ టూ బంపర్ నెమ్మదిగా కదులుతూ కనిపిస్తున్నాయి. రోజూ పది వేలకు తగ్గకుండా వాహనాలు కొండెక్కుతున్నాయి. గత శుక్ర, శని, ఆదివారాల్లో 33 వేల వాహనాల్లో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వారాంతంతో సంబంధం లేకుండా సోమవారం కూడా అధిక వాహనాలతో అలిపిరి తనిఖీ కేంద్రం రద్దీగా మారింది. మరోవైపు వాహనాలు పెరిగిన క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సులు ఒకదాని వెనుక మరొకటి క్యూ కడుతున్నాయి. దీంతో తనిఖీల కోసం దిగి వెళ్లాలని బస్సు సిబ్బంది సూచిస్తున్నారు. దీంతో చాలా మంది భక్తులు తీవ్ర ఎండలో చిన్నపిల్లలు, లగేజీతో చెమటలు కక్కుతూ నడిచి వెళుతున్నారు. వృద్ధులకూ ఇబ్బందులు తప్పడం లేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu