Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్రీడాకారులకు పౌష్టికాహారం.. ప్రతిభకు ప్రోత్సాహం

క్రీడాకారులకు పౌష్టికాహారం.. ప్రతిభకు ప్రోత్సాహం

కర్నూలు, 21 మే (హి.స.) :

గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలంటే శిక్షణతో పాటు పౌష్టికాహారం కూడా అత్యంత అవసరమని క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో కర్నూలు టౌన్ మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిబిరంలో ఈ రోజు క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

టౌన్ మోడల్ స్కూల్ పీఈటీ సుబ్రహ్మణ్యం, క్రీడా కోచ్ శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్, సెపక్ తక్రా శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులకు అరటిపళ్లు పంపిణీ చేశారు. రిటైర్డ్ ఎలక్ట్రికల్ శాఖ అధికారి కూర్మన్న, సీనియర్ జర్నలిస్ట్ ఎం. సాయి కుమార్ నాయుడు, రమణ దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ప్రస్తుతం వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ జిల్లాలో అనేక ప్రాంతాల్లో క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, సెపక్ తక్రా వంటి క్రీడల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధిక ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన పౌష్టికాహారం అందక చాలామంది ప్రతిభావంతులు మధ్యలోనే వెనుకబడుతున్న పరిస్థితులు ఉన్నాయని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.

ఈ సందర్భంగా కూర్మన్న మాట్లాడుతూ… పేద విద్యార్థులకు క్రీడలు జీవితంలో మంచి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. క్రీడాకారులకు అవసరమైన పౌష్టికాహారం అందితే వారు శారీరకంగా దృఢంగా మారడంతో పాటు పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ప్రతిభలు ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం, ఆహార లోపం వల్ల అవి వెలుగులోకి రావడం లేదన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ఎం. సాయి కుమార్ నాయుడు మాట్లాడుతూ… క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

క్రీడా కోచ్ శివకుమార్ మాట్లాడుతూ… క్రీడాకారులు ప్రతిరోజూ కఠిన సాధన చేస్తున్న నేపథ్యంలో శరీరానికి అవసరమైన పోషకాలు అందడం చాలా ముఖ్యమని తెలిపారు. చిన్న స్థాయిలో అయినా సమాజంలోని దాతలు ముందుకు వచ్చి క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu