Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మార్కాపురంలో అర్ధరాత్రి రేషన్ బియ్యం గుట్టురట్టు?

మార్కాపురంలో అర్ధరాత్రి రేషన్ బియ్యం గుట్టురట్టు?

మార్కాపురం, 02 జూలై (హి.స.) : మార్కాపురం పట్టణంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. స్థానిక జగదీశ్వరి థియేటర్ రోడ్డులోని రామాలయం సమీపంలో బుధవారం అర్థరాత్రి ఓ రేషన్ డీలర్ మినీ వ్యాన్లో రేషన్ బియ్యం బస్తాలను తరలించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

పేదలకు ఉచితంగా అందాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు లబ్ధిదారుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అనంతరం బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకటో తేదీ అర్థరాత్రే బియ్యం తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఉందా? లేక అక్రమాలకు అండదండలు లభిస్తున్నాయా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.

మార్కాపురం పట్టణంలో సుమారు 32 రేషన్ దుకాణాలు ఉండగా, కొంతమంది డీలర్లు రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు పూర్తిగా పంపిణీ చేయకుండా అక్రమ మార్గాల్లో విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, రేషన్ కోసం వెళ్లిన లబ్ధిదారులకు స్టాక్ లేదు అంటూ తిరస్కరిస్తున్నారని వారు వాపోతున్నారు.

పేదలకు నాణ్యమైన ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండగా, అక్రమాలు చోటుచేసుకుంటే ప్రభుత్వ ఉద్దేశానికే భంగం కలుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu