Dailyhunt
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీల దుర్మరణం

మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీల దుర్మరణం

ధార్, 30 ఏప్రిల్ (హి.స.)

మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడటంతో 15 మంది దుర్మరణం చెందారు.

వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఈ విషాద ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం, పనులు ముగించుకుని సుమారు 40 మందికి పైగా కూలీలు ఒక పికప్ వ్యాన్లో తమ గ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులతో, అతివేగంతో వెళ్తున్న వాహనం చిక్లియా ఫాటా సమీపంలో నియంత్రణ కోల్పోయింది. దీంతో వాహనం పలుమార్లు పల్టీలు కొట్టి, డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ఎస్యూవీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్లో ఉన్నవారు దాని కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ధార్లోని జిల్లా భోజ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఇండోర్లోని ఆసుపత్రులకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu