Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మమతా బెనర్జీ కీలక ప్రకటన.. పార్టీ ఏజెంట్లకు వీడియో సందేశం

మమతా బెనర్జీ కీలక ప్రకటన.. పార్టీ ఏజెంట్లకు వీడియో సందేశం

కలకత్తా, 04 మే (హి.స.)

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చారిత్రక విజయం దిశగా దూసుకెళుతోంది. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండగా, 15 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఓటమి అంచున నిలిచింది.

ఈ కీలక తరుణంలో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలకు కీలక సందేశం ఇచ్చారు. ఓటమిని అంగీకరించకుండా, చివరి వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.

ఒక వీడియో సందేశంలో దీదీ మాట్లాడుతూ... పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఎవరూ కౌంటింగ్ కేంద్రాలను విడిచి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఇది బీజేపీ పన్నిన కుట్ర. మొదటి రెండు మూడు రౌండ్లలో వారి ఫలితాలు ముందుగా, మనవి తర్వాత చూపిస్తారని నేను నిన్నటి నుంచే చెబుతున్నాను. సుమారు 100 చోట్ల రెండు, మూడు రౌండ్ల తర్వాత కౌంటింగ్ ఆపేశారు. కల్యాణిలో 7 ఈవీఎంలలో తేడాలు కనిపించాయి అని ఆమె ఆరోపించారు.

కేంద్ర బలగాలను ఉపయోగించి బీజేపీ తమ పార్టీపై దౌర్జన్యానికి పాల్పడుతోందని మమత తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర బలగాలను అడ్డుపెట్టుకుని టీఎంసీ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు, బలవంతంగా ఆక్రమించుకుంటున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో ఓట్లు కొల్లగొట్టి సీట్లు గెలవాలని చూశారు. అయినప్పటికీ మేము 70-100 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాం. కానీ, ఆ వార్తలను బయటకు రానీయడం లేదు. పూర్తిగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర పోలీసులు కూడా వారికి పూర్తిగా లొంగిపోయి పనిచేస్తున్నారని మమత ఆరోపించారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి.. ఎవరూ నిరాశ చెందవద్దు. సూర్యాస్తమయం తర్వాత మీరు గెలుస్తారని నేను చెప్పాను. ఇంకా 14 నుంచి 18 రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది. వేచి చూడండి. మేము మీతో ఉన్నాం. పులి పిల్లల్లా పోరాడండి అంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu