Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్ వరద బీభత్సం ఏపీలో కల్లోలం రేపుతోంది

నేపాల్ వరద బీభత్సం ఏపీలో కల్లోలం రేపుతోంది

అమరావతి, 28 ఆగస్టు (హి.స.)

నేపాల్ వరద బీభత్సం ఏపీలో కల్లోలం రేపుతోంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన తమవారి క్షేమ సమాచారం 24 గంటలుగా దొరక్క, వారి కుటుంబాలు కలత చెందుతున్నాయి.

భయపెడుతున్న వరద సమాచారం, ఆ విపత్తు చోటుచేసుకున్న ప్రాంతాల్లోనే ఏపీ యాత్రికులు ఉన్నట్టు తెలుస్తుండటంతో ఏ క్షణాన ఏ కబురు వినాల్సి వస్తోందోనని కలవరపడుతున్నాయి. ఫోన్లు స్విచ్చాఫ్లు కావడం మరింత టెన్షన్కు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తులో చిక్కుకున్న రాష్ట్ర వాసుల వివరాలను సేకరించే పనిలో ఆర్టీజీఎస్ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రాథమికంగా అధికారులు సేకరించిన వివరాల మేరకు ఏడుగురు ఏపీ వాసులు గల్లంతయ్యారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీవాసుల క్షేమ సమాచారంపై మంత్రి లోకేశ్ గురువారం సమీక్ష నిర్వహించారు. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సం ప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్నా, క్షేమంగానే ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్శాస్త్రి సహా అందరినీ రాష్ట్రానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

తిరుపతి, కర్నూలు బృందాలు క్షేమం

నేపాల్లోని ఏపీ యాత్రికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. వివిధ మార్గాల ద్వారా నేపాల్ వెళ్లి వరదల్లో చిక్కుకున్న తెలుగువారి క్షేమ సమాచారాన్ని ఆర్టీజీఎస్ తెలుసుకుంటోంది. తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం ఖాట్మాండులో యెల్లకొండ వద్ద ఒక హోటల్లో బస చేసినట్లు ఆర్టీజీఎస్ అధికారులు గుర్తించి వారితో మాట్లాడారు. ఎలాంటి సాయం అవసరమైనా తక్షణం తమను సంప్రదించాలని యాత్రికులకు సూచించారు. మళ్లీ ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆర్టీజీఎస్ అధికారులు వారికి సూచించారు. కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఐదుగురు యాత్రికులు చైనాలోని హోటల్లో సురక్షితంగా ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వీళ్లతో ఏపీ ఎన్నార్టీ అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారన్నారు.

ఎక్కువ మంది ఈశా ఫౌండేషన్ సభ్యులే..

నేపాల్ వరదల్లో గల్లంతైన తెలుగువారిలో అత్యధికులు ఈశా ఫౌండేషన్ ద్వారా నేపాల్ వెళ్లిన వారే కావడం గమనార్హం. ప్రాథమిక సమాచారం మేరకు, ఈశా ఫౌండేషన్ ద్వారా వెళ్లినవారిలో ఆరుగురు గల్లంతయ్యారు. వీరితోపాటు ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు కూడా గల్లంతయినట్లు సమాచారం. ఈశా ఫౌండేషన్ ద్వారా వెళ్లిన వారిలో.. వెన్నెలగంటి బాలసుబ్రమణ్యం, కుప్పం, చిత్తూరు జిల్లా, అట్లూరి శశికుమార్, ఎన్ఆర్ఐ, నిమ్మగడ్డ రాజ్యలక్ష్మి, ఎన్ఆర్ఐ, అన్నందేవర వెంకట్రామ్, కాకినాడ, అన్నందేవర అనగ, కాకినాడ, కాకాని అపర్ణ, గుంటూరు ఉన్నారు. వీరితోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి చొప్పవరపు రమేశ్ బాబు ఉన్నారు.

కంట్రోల్ రూం ఏర్పాటు

నేపాల్లో చిక్కుకున్న వారి కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం తెలిసినా, బాధితులు తమ క్షేమ సమాచారాన్ని తెలియజేయాలనుకున్నా 011-23384016, 23387089 నంబర్లకు సంప్రదించాలని అధికారులు కోరారు. వాట్సాప్ నంబరు 90598 24101 కూ సంప్రదించవచ్చని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu