Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పచ్చని పంచాయతీగా తూపల్లి..రాష్ట్ర స్థాయి గుర్తింపు

పచ్చని పంచాయతీగా తూపల్లి..రాష్ట్ర స్థాయి గుర్తింపు

కదిరి, 17 మే (హి.స.)

: శ్రీ సత్య సాయి జిల్లాలోని కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల పరిధిలోని తూపల్లి గ్రామపంచాయతీ "క్లీన్ అండ్ గ్రీన్" కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డును సాధించింది.

2025-26 సంవత్సరానికి గాను గ్రామంలో పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ, చెత్త నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను ఈ గౌరవం దక్కినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తూపల్లి గ్రామం చిన్న గ్రామం అయినప్పటికీ, పరిశుభ్రత విషయంలో ఆదర్శంగా నిలుస్తోంది. సుమారు 1901 జనాభా గల ఈ గ్రామం ప్రస్తుతం కూడా 78.77 శాతం పనితీరు స్కోర్ను నమోదు చేయడం విశేషం. రాష్ట్ర స్థాయిలో బ్లాక్ విభాగంలో ఈ గ్రామం ఎంపిక కావడం గ్రామ ప్రజల కృషికి నిదర్శనం అని అధికారులు పేర్కొన్నారు.

గ్రామంలో శుభ్రతను కాపాడటంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు సమిష్టిగా పనిచేశారు. ఇంటింటికి చెత్త సేకరణ, తడి-పొడి వ్యర్థాల వేరు నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేశారు. అదేవిధంగా, గ్రామ పరిసరాల్లో చెట్లు నాటడం, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి చర్యలు చేపట్టడం వల్ల "క్లీన్ అండ్ గ్రీన్" ప్రమాణాలకు అనుగుణంగా గ్రామం నిలిచింది. ఈ విజయానికి గ్రామపంచాయతీ సెక్రటరీగా పనిచేసిన సయ్యద్ భాష ముఖ్య పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించారు. గ్రామస్తులు కూడా స్వచ్ఛతపై చైతన్యంతో ముందుకు రావడం ఈ విజయానికి ప్రధాన కారణమైంది.

ప్రస్తుతం తూపల్లి గ్రామం ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. గాండ్లపెంట మండలం ఎంపీడీవో రామకృష్ణ పర్యవేక్షణలో పాలన సాగుతుండగా, ప్రత్యేక అధికారిగా మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కృష్ణ నాయక్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అధికారుల సమన్వయం, గ్రామస్థుల సహకారం వల్ల గ్రామ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతోందని తెలుస్తోంది. ఈ అవార్డు గ్రామ ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. తూపల్లి సాధించిన ఈ విజయంతో ఇతర గ్రామపంచాయతీలకు కూడా ప్రేరణ కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో తూపల్లి గ్రామం మరింత ముందుకు సాగాలని స్థానికులు సంకల్పించారు. ఇలాంటి గుర్తింపు గ్రామాభివృద్ధికి మరింత ఊతమివ్వడంతో పాటు గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలబెట్టిందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu