
ఆసిఫాబాద్, 01 జూన్ (హి.స.) పిడుగుపాటుకు మరణించిన
బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
మంత్రి సీతక్క, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాం నాయక్ లతో కలిసి సోమవారం ఆసిఫాబాద్ మండలంలోని కౌటాగూడ గ్రామాన్ని సందర్శించి పిడుగు పాటుతో మరణించిన బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించి.. తక్షణ సహాయం కింద 30 వేలు అందజేశారు. మృతులకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే కౌటగూడ గ్రామంలోని పీవీటీజీలకు 50 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. కొలాం గిరిజనులు తమ పిల్లలను చదివించి.. ప్రభుత్వం అందిస్తున్న విద్యాసౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు రెబ్బెన మండలంలోని గోలేటి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడీ పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేయడంతో పాటు చిన్నారులకు అన్నప్రాసన అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు సమతుల్య ఆహార ప్రాధాన్యత పై అవగాహన కల్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

