Dailyhunt

పోలవరం ప్రాజెక్ట్ తొలిదశ పనులు జూన్ నాటికి పూర్తి చేయాలని వీ ఎల్ కాంతారావు ఆదేశం

మరావతి, 02 మే (హి.స.)పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2027 జూన్ నాటికి పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు తగు సహకారం అందించాలని కేంద్ర సంస్థలను కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఆదేశించారు.

ప్రాజెక్టు పూర్తికి నిధుల కొరత ఉండదని.. ఇప్పటికే అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,800 కోట్లలో 75 శాతం ఖర్చుపెడితే.. మరో 3,300 కోట్లు విడుదల చేస్తామన్నారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో ఆయన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), వాప్కోస్, సెంట్రల్ వాటర్-పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూఎంఆర్ఎస్), కేంద్ర జల సంఘం, కేంద్రపర్యావరణం-అటవీశాఖ, కేంద్ర భూసేకరణ, సహాయపునరావాస శాఖ, సీఎ్సఎంఆర్ఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలవనరుల బాధ్యతలు కూడా చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కమిషనర్ ప్రశాంతి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, పీపీఏ సీఈ రమేశ్కుమార్ తదితరులు హాజరయ్యారు.

దాదాపు గంటన్నర జరిగిన సమావేశంలో.. ప్రాజెక్టు మొదటి దశ పనుల పురోగతి, భూసేకరణ, పునరావాసం, రెండో దశలో భూసేకరణ పరిహారం, సహాయ పునరావాస కార్యక్రమాలపై చర్చించారు. నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని జలశక్తి అధికారులు సూచించినట్లు తెలిసింది. కీలకమైన డయాఫ్రం వాల్ పూర్తయిందని, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం పనుల్లో వేగం కనిపిస్తోందంటూ కాంతారావు సంతృప్తి వ్యక్తం చేసినా.. నిధులున్నా వ్యయం చేయకపోవడంపై పెదవివిరిచారు. నెలకు రూ.500 కోట్లయినా ఖర్చు చేయలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. నిధుల కోసం ఎప్పుడు అభ్యర్థన లేఖ ఇస్తారని సీఎ్సను ప్రశ్నించారు. ఈ ఏడాది సెప్టెంబరునాటికి గతంలో ఇచ్చిన అడ్వాన్సులో 75 శాతం వ్యయమవుతాయని.. ఆ వెంటనే నిధుల కోసం లేఖ రాస్తామని సాయిప్రసాద్ తెలిపారు. అప్పుడు ఇంకో రూ.3300కోట్లు అడ్వాన్సు మంజూరు చేస్తామని కాంతారావు చెప్పారు. ఈ 6100 కోట్లనూ ఖర్చు చేశాక అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని నిధులు కావాలన్నా మంజూరుకు కేంద్రం సిద్ధంగా ఉందని, 2027 జూన్ నాటికి తొలిదశ పూర్తిచేయాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu