
పెద్దపల్లి, 01 జూన్ (హి.స.)
ఆయిల్ పామ్ సాగు విస్తరణకు
అవసరమైన నాణ్యమైన మొక్కలను సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ సోమవారం సుల్తానాబాద్ మండలంలోని రెబ్బల్ దేవ్పల్లి ఆయిల్ పామ్ ప్రైమరీ, సెకండరీ నర్సరీలను, ఎలిగేడు మండలంలోని ర్యాకల్ దేవ్పల్లి ప్రభుత్వ భూములను, నిర్మాణానికి సిద్ధంగా ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రెబ్బల్ దేవ్పల్లి గ్రామంలో 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆయిల్ పామ్ నర్సరీని పరిశీలించిన కలెక్టర్, రాబోయే ఖరీఫ్ సీజన్కు అవసరమైన మేర రైతులకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేయాలని సూచించారు. గత సంవత్సరం 40 వేల మొక్కలను ఇతర జిల్లాలకు సరఫరా చేసినట్లు, వాటిని తిరిగి తీసుకువస్తున్నట్లు అధికారులు వివరించారు.
ప్రస్తుతం 20 వేల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలపగా, 1,000 ఎకరాలకు అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ర్యాకల్ దేవ్పల్లి పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్, మండలంలోని ప్రభుత్వ భూములకు సంబంధించిన సంపూర్ణ వివరాలను సిద్ధం చేసి సమర్పించాలని తహసీల్దార్ను ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతతో పనులు చేపట్టాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

