Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: పినపాక ఎమ్మెల్యే

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: పినపాక ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం, 19 మే (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక రాజీవ్ నగర్ కాలనీ, భాస్కర్ నగర్ కాలనీల్లో సుమారు రూ.85 లక్షల భారీ అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను మంగళవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీల్లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఎమ్మెల్యే ఆవిష్కరించి, సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు. అనంతరం ఆయన చేతుల మీదుగా సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, స్థానిక మహిళలు ఎమ్మెల్యేకు మంగళహారతులతో, ఘన స్వాగతం పలికారు.

రోడ్లను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని, కాలనీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కాలనీల్లో అంతర్గత రహదారుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకే ఈ సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ప్రజాధనం సద్వినియోగం అయ్యేలా, పనుల్లో పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో సారపాక పంచాయతీ పరిధిలో మిగిలిపోయిన ఇతర సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చాలా కాలంగా సరైన రోడ్డు వసతి లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు రూ. 85 లక్షల వ్యయంతో అధునాతన సిమెంట్ రోడ్లు నిర్మించడం పట్ల రాజీవ్ నగర్, భాస్కర్ నగర్ కాలనీ ప్రజలు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu