Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ప్రకృతి వ్యవసాయంతో అద్భుతాలు చేస్తున్న ద్వారకానాథరెడ్డిని అభినందించిన లోకేష్

పెనికలపాడు, 22 మే (హి.స.)

సాయన ఎరువుల వాడకంతో దెబ్బతింటున్న భూసారాన్ని కాపాడుతూ, పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవాలంటే రైతులు సేంద్రియ సాగు వైపు మళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమైన 'జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్' విధానాన్ని క్షేత్రస్థాయిలో ప్రోత్సహించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

కడప జిల్లాలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా, జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. సమీకృత సేంద్రియ సాగు పద్ధతులతో ఆదర్శంగా నిలుస్తున్న రైతు మునగాల ద్వారకానాథ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న మంత్రికి రైతు ద్వారకానాథరెడ్డి, ఆయన అర్ధాంగి రాఘవేంద్రవతి సాదరంగా స్వాగతం పలికారు.

17 ఎకరాల్లో సమీకృత సేద్యం.. ఆదర్శంగా నిలుస్తున్న రైతు కుటుంబం

పెనికలపాడు గ్రామానికి చెందిన మునగాల ద్వారకానాథరెడ్డి, ఆయన సోదరుడు రమణారెడ్డి గత ఐదేళ్లుగా తమ ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 ఎకరాల పొలంలో ప్రకృతి సేద్యం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పంటల సాగుతో పాటు పశుపోషణ, కోళ్లు, గొర్రెలు, చేపల పెంపకాన్ని అనుసంధానం చేసి సమీకృత సేంద్రియ వ్యవసాయం ద్వారా స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. తమ వ్యవసాయ క్షేత్రంలో మామిడి, బత్తాయి, ఉసిరి, కొబ్బరి, జామ, నేరేడు, మునగ, రామాఫలం, సీతాఫలం వంటి పండ్ల తోటలతో పాటు 250 నాటుకోళ్లు, 60 పొట్టేళ్లు, చేపల పెంపకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రైతు ద్వారకానాథ రెడ్డితో మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం వైపు రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామానికి చెందిన 70 ఏళ్ల సేంద్రియ రైతు లక్ష్మీనారాయణను స్ఫూర్తిగా తీసుకుని ఈ మార్గంలోకి వచ్చామని ద్వారకానాథరెడ్డి వివరించారు. తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో నిలదొక్కుకున్నామని తెలిపారు. తిరుపతిలో సేంద్రియ సాగుపై ప్రత్యేక శిక్షణ ఇప్పించారని, తమకు బయో రీసెర్చ్ సెంటర్ కూడా కేటాయించారని చెప్పారు. పొలంలోనే సహజ ఎరువులు, 32 రకాల జీవ వైవిధ్య విత్తనాలను తయారు చేసుకుంటున్నామని, దీనివల్ల రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరమే లేకుండా పోయిందని అన్నారు.

ఒక్క దేశవాళీ ఆవుతో 20 ఎకరాల వరకు సేంద్రియ సాగు చేయవచ్చని, 250 నాటుకోళ్ల పెంపకం వల్ల పొలంలో కలుపు తీసే పని, పురుగుల బెడద తప్పిందని వివరించారు. కేవలం మామిడి తోటల ద్వారానే ఏటా రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు ఆదాయం వస్తోందని తెలిపారు. ప్రభుత్వ సహకారం మరింత లభిస్తే ప్రకృతి వ్యవసాయంలో ఇంకా అద్భుతాలు సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu