Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలి.. కామారెడ్డి జిల్లా ఎస్పీ

ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలి.. కామారెడ్డి జిల్లా ఎస్పీ

కామారెడ్డి, 04 జూలై (హి.స.)

జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర

ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద పోలీసు శాఖ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో సుమారు 160 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ పోలీసు-ప్రజల మధ్య విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములను చేయడమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో 121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటోలు, రెండు కార్లు గుర్తించారు. వీటిలో 11 వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండా సంచరిస్తున్నట్లు గుర్తించారు. అలాగే 18 బీర్ బాటిళ్లు, 12 క్వార్టర్ మద్యం బాటిళ్లు, ఒక తల్వార్ను స్వాధీనం చేసుకున్నారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల పై ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కత్తులు, తల్వార్లు, ఇతర మారణాయుధాలతో ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి యువతను రెచ్చగొట్టేలా లేదా ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, నిల్వ, విక్రయం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహాలు, రోజువారీ అలవాట్లను గమనించాలని సూచించారు. రోజులో కనీసం ఒకపూట కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడం ద్వారా పిల్లల ఆలోచనలు, ప్రవర్తనను అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

పిల్లల్లో అనుమానాస్పద మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని సూచించారు. గంజాయి వ్యసనానికి గురైన వారి గురించి సమాచారం అందిస్తే వారికి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి పోలీసు శాఖ సహకరిస్తుందని చెప్పారు. సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ, కేవైసీ, పెట్టుబడుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu