Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామమందిరం విరాళాల దొంగతనం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఆలోక్ కుమార్

రామమందిరం విరాళాల దొంగతనం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఆలోక్ కుమార్

న్యూఢిల్లీ, 04 జూలై (హి.స.): అయోధ్య రా జన్మభూమి ఆలయం విరాళాల దొంగతనం కేసులో నిష్పక్షపాత విచారణ జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ (విహిప్) అంతర్జాతీయ అధ్యక్షుడు ఆలోక్ కుమార్ డిమాండ్ చేశారు.

హిందుస్థాన్ సమాచార్‌తో మాట్లాడిన ఆలోక్ కుమార్... ఈ ఘటన మొత్తం హిందూ సమాజాన్ని తీవ్రంగా గాయపరిచిందని పేర్కొన్నారు. నిష్పక్షపాత విచారణ, దోషులకు కఠిన శిక్ష పడాలని మొదటి నుండి సంస్థ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ఘటన గురించిన సమాచారం అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, అనుభవజ్ఞులైన అధికారులతో దర్యాప్తు జరిపించాలని, నిజాలు త్వరగా వెలుగులోకి రావడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టాలని సంస్థ కోరినట్లు ఆయన స్పష్టం చేశారు.

చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావులను కాపాడుతున్నారనే ఆరోపణలపై విహిప్ అధ్యక్షుడు స్పందిస్తూ... సంస్థ ఏ ఒక్కరినీ కాపాడే ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరిపై నిష్పక్షపాత విచారణ జరగాలని, ఎవరైనా నేరానికి పాల్పడినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ఆలయ నిర్వహణపై వస్తున్న ప్రశ్నల నేపథ్యంలో... భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి బలమైన పరిపాలనా, సాంకేతిక వ్యవస్థలు అవసరమని ఆలోక్ కుమార్ అంగీకరించారు.

ఆలయ నిర్వహణను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. విరాళాల సొమ్ము సురక్షితంగా ఉండటానికి ఆధునిక భద్రతా వ్యవస్థ, పారదర్శక విధానాలు, అనుభవజ్ఞులైన పరిపాలనా అధికారుల నియామకం వంటి చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. చంపత్ రాయ్ వ్యాఖ్యలు, ఆయనపై వచ్చిన ఆరోపణల విషయంలో విహిప్ సంయమనం పాటించింది.

మీడియా నివేదికల ఆధారంగా ఒక ముగింపునకు రావడం సరికాదని, దర్యాప్తు పూర్తికాకముందే ఎవరిపైనైనా సంస్థాగత చర్యలు తీసుకోవడం తొందరపాటు అవుతుందని విహిప్ పేర్కొంది. విచారణలో ఎవరిదైనా నిర్లక్ష్యం లేదా నేరం నిరూపితమైతే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని పునరుద్ఘాటించింది. కొద్దిమందిపై వచ్చిన ఆరోపణల ఆధారంగా మొత్తం ట్రస్ట్‌ను రద్దు చేయాలనే డిమాండ్ సరైనది కాదని విహిప్ అభిప్రాయపడింది. మిగిలిన ట్రస్ట్ సభ్యులు ప్రతిష్ఠాత్మక సాధువులు, గౌరవనీయ వ్యక్తులని సంస్థ తెలిపింది.

కోట్లాది రామభక్తుల నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గం... విచారణ పూర్తిగా పారదర్శకంగా జరగడం, దోషులకు శిక్ష పడటం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కచ్చితమైన ఏర్పాట్లు చేయడం మాత్రమేనని ఆలోక్ కుమార్ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu