
కరీంనగర్, 05 మే (హి.స.)
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నట్టేట ముంచుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
మంగళవారం వారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి స్థానిక సమస్యలపై రైతులతో మాట్లాడారు. వడ్ల కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోయారు. తాలు, తరుగు పేరుతో బస్తాకు నాలుగైదు కేజీలు దోచుకుంటున్నారని తెలిపారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
రైతులు చస్తున్నా ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయరా? కొనుగోలు కేంద్రాల వద్ద అరిగోస పడుతున్నా స్పందించరా? అని ప్రశ్నించారు. ప్రతి గింజను కేంద్రమే పైసలిస్తుంటే కొనడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేమిటో తెలపాలని అన్నారు. వడ్లు కొన్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ కూడా కేంద్రం నిధులు ఇస్తుంది అన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళితే మంత్రులను రైతులు కొట్టేటట్లు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతికి పంట వచ్చేదాకా ఒక టెన్షన్.. చేతికొచ్చాక అమ్ముకోవడానికి పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది అన్నారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే.. ఇప్పటిదాకా 15 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్లు ఇవ్వడానికి కూడా కమీషన్లు దండుకుంటున్న దుర్మార్గుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాలు, తరుగు, తేమ పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు అని వారి పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వలేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

