బుట్టాయగూడెం, 07 జూలై (హి.స.)
బుట్టాయగూడెం, రోగులకు వైద్యం అందించాల్సిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి ప్రాణం తీసింది.
తల్లిదండ్రులు సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినా సరైన వైద్యం అందక బుట్టాయగూడెం మండలం మారుమూల గ్రామమైన మోతుగూడేనికి చెందిన గోగుల జేత్విక సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. కుమార్తెను కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.
గ్రామానికి చెందిన గోగుల వెంకటరెడ్డి, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. చిన్న పాప జేత్వికను అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. వెంకటరెడ్డి ఇటీవల జ్వరంతో బాధపడుతూ బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందారు. శనివారం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లారు. అదే రాత్రి కుమార్తె జేత్విక జ్వరం బారినపడి వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో బంధువుల సాయంతో తల్లిదండ్రులు అదే ఆసుపత్రికి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న చిన్నపిల్లల వైద్యుడు పరీక్షించి మందులు, ఇంజెక్షన్, ఫ్లూయిడ్ పెట్టాలని రాశారు. సిబ్బంది కేవలం మందులు ఇచ్చి, ఇంజెక్షన్ చేసి వదిలేశారని, ఆదివారం కూడా అదే తీరుతో వ్యవహరించారని తండ్రి వెంకటరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి రౌండ్స్కి వచ్చిన చిన్నపిల్లల వైద్యుడు పాప పరిస్థితి తీవ్రంగా ఉందని జంగారెడ్డిగూడెం తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు 108లో జంగారెడ్డిగూడెం తీసుకెళ్తుండగా విషమించి మార్గం మధ్యలో మృతిచెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఎటువంటి రక్తపరీక్షలు చేయలేదని, సెలైన్లు పెట్టకుండా వదిలేశారని చెబుతున్నారు. ఆ గ్రామం అంతర్వేదిగూడెం పీహెచ్సీ పరిధిలోకి వస్తోంది. ఆసుపత్రి, గ్రామంలో వైద్యాధికారి సురేశ్కుమార్ విచారణ చేశారు. మలేరియా నిర్ధారణకు కనీసం ర్యాపిడ్ పరీక్ష చేయలేదని గుర్తించినట్లు ఆయన తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
