అమరావతి, 21 మే (హి.స.):తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సమావేశం ఈరోజు (గురువారం) మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. నూతన కార్యవర్గం, పొలిట్బ్యూరో నియామకం తర్వాత తొలిసారి ఈ భేటీ జరిగింది.
ఈ సమావేశానికి వర్చువల్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ భేటీలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు. ఈసారి మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్బ్యూరో నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 10 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 4 తీర్మానాలు, అండమాన్కు సంబంధించిన ఒక తీర్మానం, ఉమ్మడి అంశాలపై 4 తీర్మానాలు, రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
మహిళా సంక్షేమంపై ఫోకస్..
2026 మహానాడును 'స్త్రీ శక్తి' థీమ్తో నిర్వహించాలని పొలిట్బ్యూరో నిర్ణయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మహిళా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, మహిళల భాగస్వామ్యంతో అమలు చేసిన కార్యక్రమాలను మహానాడు వేదికగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. మహిళల భాగస్వామ్యంతోనే ప్రతి సంక్షేమ పథకాన్ని రూపొందించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై మహానాడులో సమగ్ర చర్చ జరగాలని దిశానిర్దేశం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
