
కోల్‌కతా, 07 జూలై (హి.స.)
:
తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ బ్యాంక్ ఖాతాల ద్వారా రూ. 150 కోట్లకు పైగా అనుమానాస్పద నిధులను మళ్లించారనే ఆరోపణలపై ఈడీ మంగళవారం ఉదయం నుండి కోల్‌కతా మరియు దాని చుట్టుపక్కల ఐదు వేర్వేరు ప్రాంగణాలలో ముమ్మర సోదాలు చేపట్టింది.
అక్రమ ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం, విమానయాన (Aviation), ట్రావెల్ కంపెనీలను ఉపయోగించుకుని ఈ భారీ నిధులను అనుమానాస్పద మార్గాల్లో మళ్లించినట్లు ఆధారాలు లభించాయి. ఈ దాడులలో ప్రధానంగా కేర్‌వెల్ ఏవియేషన్ (Carewell Aviation), దాని డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాలతో పాటు ఒక ఎలక్టోరల్ ట్రస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాడుల సమయంలో స్వాధీనం చేసుకున్న కీలక ఆర్థిక రికార్డులు, డిజిటల్ పత్రాలు మరియు బ్యాంక్ లావాదేవీలను అధికారులు ప్రస్తుతం నిశితంగా పరిశీలిస్తున్నారు.ఈ దర్యాప్తునకు ముందే పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ పార్టీ ఖాతాలపై తీవ్ర రాజకీయ, అంతర్గత వివాదం నడుస్తోంది. పార్టీ నిధుల నియంత్రణపై వచ్చిన అంతర్గత విభేదాల నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కోల్‌కతాలోని HDFC బ్యాంక్ సెంట్రల్ ప్లాజా బ్రాంచ్‌లో ఉన్న మూడు టీఎంసీ పార్టీ ఖాతాలను సైబర్ క్రైమ్ పోలీసులు గతంలోనే 'డెబిట్ ఫ్రీజ్' చేశారు. ఆ మూడు నిర్దిష్ట ఖాతాలలో దాదాపు రూ. 440 కోట్ల నుండి రూ. 535 కోట్ల వరకు నిధులు నిల్వ ఉన్నట్లు పోలీసుల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అక్రమ వసూళ్లు (Cut-money), వివిధ స్కామ్‌ల ద్వారా వచ్చిన ప్రజాధనాన్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ ఖాతాల్లోకి చేర్చారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించడంతో, గత ఐదేళ్ల కాలంలో జరిగిన ఇన్‌వర్డ్, అవుట్‌వర్డ్ లావాదేవీలపై రాష్ట్ర పోలీసులు కూడా లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర సంస్థ అయిన ఈడీ రంగంలోకి దిగి ఏవియేషన్ కంపెనీల లింకులను బయటకు తీస్తూ సోదాలు చేపట్టడం గమనార్హం.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

