Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తొలకరి కబురు... ఈ నెల 26నే కేరళకు రుతుపవనాలు

తొలకరి కబురు... ఈ నెల 26నే కేరళకు రుతుపవనాలు

ఢిల్లీ, 15 మే (హి.స.)

దేశవ్యాప్తంగా ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించనున్నాయని అధికారికంగా ప్రకటించింది.

సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు, ఈసారి ఐదు రోజులు ముందుగా, అంటే మే 26నే తీరాన్ని తాకే అవకాశం ఉందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఈ తేదీకి నాలుగు రోజులు అటూఇటూగా రుతుపవనాలు కేరళలో ప్రవేశించవచ్చు. అంటే మే 22 నుంచి మే 30 మధ్య ఎప్పుడైనా నైరుతి రుతుపవనాల రాక ఉండొచ్చని అర్థం చేసుకోవాలి. రుతుపవనాల ఆగమనంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. వేసవి కాలం ముగిసి, వర్షాకాలం ప్రారంభానికి ఇది సూచికగా నిలుస్తుంది.

ఐఎండీ 2005 నుంచి కేరళలో రుతుపవనాల ప్రవేశ తేదీపై అంచనాలను వెలువరిస్తోంది. ఇందుకోసం దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక స్టాటిస్టికల్ మోడల్ను ఉపయోగిస్తోంది. వాయువ్య భారతదేశంలో కనీస ఉష్ణోగ్రతలు, ద్వీపకల్పంలో రుతుపవనాలకు ముందు కురిసే వర్షపాతం, ఆగ్నేయ హిందూ మహాసముద్రంలోని గాలుల వేగం సహా మొత్తం ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాను రూపొందిస్తారు.

గత 21 సంవత్సరాలుగా (2005-2025) ఐఎండీ విడుదల చేసిన అంచనాలు దాదాపుగా కచ్చితంగా ఉన్నాయి. కేవలం 2015లో మాత్రమే అంచనా తప్పింది. గత ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, వాస్తవ తేదీకి, అంచనా తేదీకి కేవలం ఒకటి రెండు రోజుల తేడా మాత్రమే ఉండటం ఈ మోడల్ కచ్చితత్వానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో తాజా అంచనా కూడా నిజమై, దేశ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు సకాలంలో ఊరట లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu