Dailyhunt

తూర్పు ఇండోనేసియాలో భారీ భూకంపం...సునామీ హెచ్చరికలు జారీ

ఢిల్లీ, 02 ఏప్రిల్ (హి.స.)

తూర్పు ఇండోనేషియాలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించింది.

సముద్రంలో భూకంపం సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల (621 మైళ్లు) పరిధిలో ప్రమాదకరమైన సునామీ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:48 గంటలకు మొలుక్కా సముద్రంలో టెర్నాటే ద్వీపానికి సమీపంలో ఈ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్జీఎస్ గుర్తించింది. దీని ప్రభావంతో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే ప్రమాదం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. భూకంపం కారణంగా నార్త్ సులవేసి ప్రావిన్స్లోని మనాడో నగరంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూమి కంపించడంతో నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమీపంలోని ఓ పాఠశాలలోని విద్యార్థులు కూడా భయంతో బయటకు వచ్చారు. చాలా సేపటి వరకు భూమి కంపించిందని,

అయితే ప్రాథమికంగా ఎలాంటి ఆస్తి నష్టం కనిపించలేదని స్థానిక మీడియా ప్రతినిధి ఒకరు తెలిపారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

-------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu