Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

విజయవాడ ఆయుర్వేద కాలేజీలో లైంగిక వేధింపుల ఘటన.. నలుగురిపై వేటు

విజయవాడ, 04 మే (హి.స.)

విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

ఈ వ్యవహారంలో బాధ్యులైన నలుగురిపై వైద్యారోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని సస్పెండ్ చేయగా, మరో ఇద్దరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. మౌళి నాయక్, ల్యాబ్ టెక్నీషియన్ కె.వి. సుబ్రహ్మణ్యంలను సస్పెండ్ చేశారు. అదేవిధంగా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. నిర్మలా జ్యోతిబాయి, పీఎస్పీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కె. విజయ కుమారిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ వివరాలను ఆయుష్ ఇన్చార్జ్ కమిషనర్ రోణంకి గోపాలకృష్ణ వెల్లడించారు.

ఈ ఘటనపై ఇప్పటికే కళాశాలలో అంతర్గత విచారణ కొనసాగుతోందని గోపాలకృష్ణ తెలిపారు. దాంతో పాటు, పూర్తిస్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపించేందుకు ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశాకు లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థినుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏపీ మహిళా కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu