Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

విజయవాడలో ఆంధ్రప్రదేశ్.జాయింట్ యాక్షన్. కమిటీ సెప్టెంబర్ 5 న రాష్ట్ర కార్యవర్గ సమావేశం

అమరావతి, 30 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీ జేఏసీ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం సెప్టెంబరు 5న విజయవాడలో జరుగనుంది. పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలు, ఇతర డిమాండ్లు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలను ఇందులో ప్రధానంగా చర్చించనున్నట్లు ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కేఎ్సఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు.. మంత్రుల బృందం సమావేశంలో చర్చల అనంతరం సీఎం చంద్రబాబుతో త్వరలో సమావేశం ఏర్పాటవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి, పెండింగ్ సమస్యలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు, సంప్రదింపుల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విద్యాసాగర్ తెలిపారు. 'బాధ్యతాయుతమైన ప్రధాన వ్యవస్థగా, సంఘంగా చర్చలు సానుకూల వాతావరణంలో జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. చర్చలు పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో మాత్రమే ఉద్యమ కార్యాచరణ అనివార్యమవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం-ఉద్యోగుల మధ్య సానుకూల వాతావరణం కొనసాగుతోంది. ఇది రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు మరింత మంచి సేవలు అందించడానికి దోహదపడుతుంది' అని పేర్కొన్నారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఇతర ఆర్థిక బకాయిల విషయంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కల్పించేలా ప్రభుత్వం వీటిపై అత్యవసరంగా దృష్టి సారించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. చర్యలు, సంప్రదింపుల ద్వారా పరిష్కారానికే తొలి ప్రాధాన్యమని, అవసరమైన పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణకు వెనుకాడే ప్రసక్తే లేదన్నారు.

ఇవన్నీ ఇచ్చినా..ప్రభుత్వం రూ.22 వేల కోట్ల బకాయిలు చెల్లింపు, ఒకటో తారీఖున జీతాలు చెల్లింపు, 11 వేల మంది ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపు, 8000 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, పదవి విరమణ వయస్సుని ప్రభుత్వ రంగ సంస్థలకు గురుకుల పాఠశాలలకు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం, అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు భాగస్వామ్యం చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. ఉద్యోగుల పీఆర్సీ, డీఏ తదితర ఆర్థిక అంశాల్లో ముందుకు రావాల్సిన బాధ్యత దానిదేనని విద్యాసాగర్ తెలిపారు. సానుకూలంగా స్పందించని పక్షంలో డిమాండ్ల సాధన కోసం తదుపరి ఉద్యమ కార్యాచరణపై రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 5న జరిగే భేటీలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన నూతన కమిటీల సభ్యుల పరిచయం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2025పై సమగ్ర చర్చ జరుగుతాయని వెల్లడించారు. రాష్ట్ర జేఏసీ నాయకులతోపాటు అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల జేఏసీ ప్రధాన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యాచరణపైనా చర్చిస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu