Annamalai
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం 'వి ది లీడర్స్' (We The Leaders) వ్యవస్థాపకుడైన కె. అన్నామలై కేంద్ర ప్రభుత్వంపై సంచలన విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో నిరసనకారులపై పోలీసు బలప్రయోగాన్ని, భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్న తీరును తీవ్రంగా తప్పుపడుతూ ఆయన సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. కేంద్రంలో 12 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం తన ప్రాధాన్యతను కాపాడుకోవడానికి నిరంతరం కొత్త శత్రువులను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, ఇది నిజంగా విచారకరమని వ్యాఖ్యానించారు.
2011 నాటి మోదీ వ్యాఖ్యలతో పోలిక
ఢిల్లీలో 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నిర్వహించిన నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తూ, 2011 నాటి సంఘటనను అన్నామలై గుర్తుచేశారు. ఆనాడు ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన అవినీతి వ్యతిరేక పోరాటంపై పోలీసుల చర్యను అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ తీవ్రంగా నిరసించారని పేర్కొన్నారు. అయితే, నేడు పరిస్థితులు మారాయని, ప్రభుత్వ విధానాలను లేదా చట్టబద్ధమైన ప్రక్రియ ఉల్లంఘనలను ప్రశ్నించే వారిపై వెంటనే అణచివేత చర్యలు ప్రారంభమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలు అడిగితే 'విదేశీ ఏజెంట్లు' అని, 'దేశద్రోహులు' అని ముద్ర వేసి దాడి చేస్తున్నారని మండిపడ్డారు.
సిజెపికి ఉచిత ప్రచారంపై అనుమానాలు
సిజెపి నిరసనలపై బీజేపీ స్పందిస్తున్న తీరును కూడా అన్నామలై తప్పుపట్టారు. దసరా వేడుకల సమయంలో బొద్దింక బొమ్మను తగలేయడం వంటి చర్యల ద్వారా సిజెపికి జాతీయ స్థాయిలో ఉచితంగా పబ్లిసిటీ కల్పిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఓట్లను చీల్చే వ్యూహంలో భాగంగానే ఆ పార్టీని పెద్దదిగా చేసి చూపుతున్నారా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఉచితంగా ప్రచారం చేయడంలో సిజెపికి బీజేపీ కంటే మంచి పబ్లిక్ రిలేషన్స్ టీమ్ మరొకటి దొరకదని చురకలంటించారు.
తిప్పికొట్టిన తమిళనాడు బీజేపీ శ్రేణులు
అన్నామలై వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పార్టీ కార్యదర్శి వినోజ్ పి. సెల్వం స్పందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని, శాంతియుత నిరసనలకు హక్కు ఉన్నట్లే చట్టాన్ని అమలు చేసే అధికారం పోలీసులకు ఉంటుందని స్పష్టం చేశారు. 2011 నాటి వ్యాఖ్యలను నేటి పరిస్థితులకు ఆపాదించడం సరికాదన్నారు. మరోవైపు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ, గతంలో ఓటర్ల జాబితా సవరణను సమర్థించిన అన్నామలై, పార్టీ వీడిన తర్వాత తన వైఖరి మార్చుకోవడంపై ప్రశ్నించారు. ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా, సీనియర్ రాజకీయ నేతగా మాటల్లో स्थిరత్వం ఉండాలని హితవు పలికారు.
"దేశద్రోహం" ముద్రలపై తీవ్ర అసంతృప్తి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతీ నిరసన వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందనడాన్ని అన్నామలై తోసిపుచ్చారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ (FCRA) హోం మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉనందున, విదేశీ నిధుల అంశాలపై దర్యాప్తు చేసేందుకు కేంద్రానికి తగినంత యంత్రాంగం ఉందన్నారు. ప్రతీ చిన్న విషయానికి దేశద్రోహం ముద్ర వేసే ధోరణిని ఇకనైనా ఆపాలని, విమర్శలకు ప్రభుత్వం తన పాలనాపరమైన పనితీరు ఆధారంగా సమాధానం చెప్పాలే తప్ప శత్రువులను తయారుచేయకూడదని స్పష్టం చేశారు.

