Dailyhunt
Abortion Pills : యువతలో అబార్షన్ పిల్స్  క్రేజ్.. ఆన్‌లైన్‌లో విచ్చలవిడిగా ఆర్డర్లు

Abortion Pills : యువతలో అబార్షన్ పిల్స్ క్రేజ్.. ఆన్‌లైన్‌లో విచ్చలవిడిగా ఆర్డర్లు

hmtv 2 weeks ago

Abortion Pills

Abortion Pills

Abortion Pills : అగ్రరాజ్యం అమెరికాలో యువత తీసుకుంటున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అక్కడ టీనేజర్లు, యువతులు హాస్పిటళ్లకు వెళ్లకుండానే ఆన్‌లైన్ ద్వారా అబార్షన్ మందులను ఆర్డర్ చేయడం విపరీతంగా పెరిగిపోయిందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ముఖ్యంగా 18 ఏళ్ల లోపు వారు, అలాగే 24 ఏళ్ల లోపు యువతులు టెలీహెల్త్ సేవల ద్వారా ఈ మందులను ఎక్కువగా పొందుతున్నట్లు JAMA Health Forum జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక పేర్కొంది.

విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీకి చెందిన డానా జాన్సన్, రట్గర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లారా డి.లిండ్‌బర్గ్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన నిర్వహించింది. 2022లో Roe vs Wade తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. క్లినిక్‌లకు వెళ్లి అబార్షన్ చేయించుకోవడం కష్టతరం కావడంతో, యువత టెలీమెడిసిన్ వైపు మళ్లారు. 2025 ప్రారంభం నాటికి, అమెరికాలో జరుగుతున్న ప్రతి నాలుగు అబార్షన్లలో ఒకటి టెలీహెల్త్ ద్వారానే జరుగుతోందని అంచనా. ముఖ్యంగా 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువతులు పెద్దల కంటే వేగంగా ఈ మందులను ఆర్డర్ చేస్తున్నారు.

18 ఏళ్ల లోపు టీనేజర్లు ఈ మందుల వైపు మళ్లడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల ప్రమేయం చట్టాలు. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో మైనర్లు అబార్షన్ చేయించుకోవాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. కానీ ఆన్‌లైన్ టెలీహెల్త్ సేవలు ఎలాంటి వయస్సు పరిమితి లేకుండా మందులను డెలివరీ చేస్తున్నాయి. దీనివల్ల తల్లిదండ్రులకు తెలియకుండానే టీనేజర్లు గర్భస్రావం చేసుకునే అవకాశం దొరుకుతోంది. సుమారు 70 లక్షల మంది టీనేజ్ అమ్మాయిలు అబార్షన్లపై కఠిన నిబంధనలున్న రాష్ట్రాల్లోనే నివసిస్తుండటంతో, వారంతా ఈ ఆన్‌లైన్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

అబార్షన్ క్లినిక్‌లకు వెళ్లాలంటే కనీసం 600 డాలర్లు (సుమారు రూ.50 వేలు) ఖర్చవుతుంది. టీనేజర్ల దగ్గర అంత డబ్బు ఉండదు. పైగా క్లినిక్‌లకు వెళ్లడానికి సొంత కార్లు లేదా డ్రైవింగ్ లైసెన్సులు లేకపోవడం కూడా ఒక అడ్డంకి. వీటికి తోడు సమాజంలో ఎదురయ్యే చిన్నచూపు, అవమానం భరించలేక చాలామంది రహస్యంగా ఆన్‌లైన్ లో పిల్స్ తెప్పించుకుంటున్నారు. జ్యుడీషియల్ బైపాస్ వంటి చట్టపరమైన మార్గాలు ఉన్నప్పటికీ, అవి చాలా క్లిష్టంగా ఉండటంతో సులభంగా దొరికే ఆన్‌లైన్ మందులకే మొగ్గు చూపుతున్నారు.

ఆన్‌లైన్ లో మందులు వాడటం వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా చట్టపరంగా కూడా భారీ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎఫ్‌డీఏ నిబంధనల ప్రకారం గర్భస్రావం మందులైన మిఫెప్రిస్టోన్ వినియోగంపై పరిమితులు ఉన్నాయి. ఆన్‌లైన్ లో మందులు తెప్పించుకుని వాడినందుకు ఇప్పటికే కొందరు యువతపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అబార్షన్ మందుల భద్రత గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని, ఇది యువత ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu