Amaravati: ముగిసిన సీఎం చంద్రబాబు వారం రోజుల పర్యటన.. నేడు అమరావతికి!
Amaravati: వరుసగా వారం రోజుల పాటు నాలుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తిరిగి అమరావతికి రానున్నారు.
ఉదయం 11 గంటలకు కుప్పం నుంచి నేరుగా రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్న సీఎం... ఆర్టీజీఎస్ సమీక్షతో పాటు పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. వారం రోజుల పాటు క్షణం తీరిక లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పరిశ్రమలు, రైతులు-ప్రజలతో ముఖాముఖి సమావేశాలతో సీఎం పర్యటన కొనసాగింది.
*నెల్లూరులో పేదల సేవలో కార్యక్రమం*
ఈనెల 1న అమరావతి నుంచి బయలుదేరిన సీఎం తొలుత నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని పున్నపువారిపాలెం చేరుకుని పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలో పద్మమ్మకు ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్, తులశమ్మకు దివ్యాంగ పింఛన్ అందజేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ ఇప్పటివరకు రూ.68,598 కోట్ల పెన్షన్లు పంపిణీ చేశామని తెలిపారు. నెల్లూరు జిల్లా అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని, త్వరలో మెగా ఫర్నిచర్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.
*హీరో మోటార్స్‌కు శంకుస్థాపన*
నెల్లూరు కార్యక్రమం అనంతరం తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్-2.0కు సీఎం చంద్రబాబు, హీరో మోటార్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. పీ4లో భాగస్వామ్యం కోసం హీరో సంస్థ ముందుకు రాగా, హీరోస్ ఆఫ్ టుమారో స్కాలర్‌షిప్‌లను సీఎం ఆవిష్కరించారు.
*వీబీజీ రామ్ జీ పథకం ప్రారంభం*
జూలై 2న తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి వీబీజీ రామ్ జీ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. ముక్కవారిపల్లి గ్రామంలో మూడు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి లబ్ధిదారులకు జాబ్ కార్డులు అందజేశారు. కేంద్రం రూ.7,700 కోట్లు, రాష్ట్రం రూ.4 వేల కోట్లతో ఈ పథకం అమలు చేయనుంది.
*ప్రణాళిక శాఖ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సీఎం*
అదే రోజు సాయంత్రం తిరుపతిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో భాగమైన 'ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్' రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో సీఎం పాల్గొన్నారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికతతో సమర్థవంతమైన పరిపాలన ద్వారానే రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.
*రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు శ్రీకారం*
జూలై 3న కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లిలో జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను సీఎం ప్రారంభించారు. రూ.16,350 కోట్లతో నిర్మించే స్టీల్ ప్లాంట్‌తో పాటు రూ.20,350 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టుకు కూడా శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కును వర్చువల్‌గా ప్రారంభించారు.
*కుప్పంలో పెట్టుబడుల జోరు*
కడప నుంచి నేరుగా కుప్పం చేరుకున్న సీఎం మూడు రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. 'స్వర్ణ కుప్పం-పెట్టుబడుల వేదిక'లో రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 30 ప్రాజెక్టులకు ఎంవోయూలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా 39,535 మందికి, పరోక్షంగా 47,539 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఏబీఐఎస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, ఏపీఐఐసీ ఎంఎస్ఎంఈ పార్క్‌ను ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కుటుంబాలకు సోలార్ రూఫ్‌టాప్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
*మోడల్ బస్ స్టేషన్, భూ సమస్యకు పరిష్కారం*
కుప్పం రెండో రోజు పర్యటనలో రూ.118 కోట్లతో నిర్మించే అత్యాధునిక మోడల్ బస్ స్టేషన్, డిపోకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆరు దశాబ్దాల కంగుంది భూ సమస్యకు పరిష్కారం చూపుతూ 322 మంది రైతులకు 460.19 ఎకరాల డీకేటీ పట్టాలు అందజేశారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించి, స్వర్ణ కుప్పం-స్వచ్ఛ కుప్పం స్వాగత ఆర్చ్‌ను ప్రారంభించారు.
*రైతులు, పీ4 లబ్ధిదారులతో ముఖాముఖి*
మూడో రోజు పర్యటనలో పౌల్ట్రీ రైతులు, అభ్యుదయ రైతులు, పీ4 లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. పర్యావరణ నియంత్రిత పౌల్ట్రీ ఫారాన్ని ప్రారంభించి రైతులతో మాట్లాడారు. ఐటీసీ, విశాలాక్షి ఇన్నోవేషన్స్ సంస్థలతో కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఒప్పందాలు కుదుర్చుకుంది. కుప్పంలోని 9 వేల బంగారు కుటుంబాల బాధ్యతను అదానీ, టీవీఎస్, మెగా సంస్థలకు అప్పగించామని సీఎం తెలిపారు.
*రేపు అమరావతిలో సమీక్షలు*
ఆదివారం రాత్రి కుప్పంలో బస చేసిన ముఖ్యమంత్రి సోమవారం ఉదయం కుప్పం నుంచి నేరుగా అమరావతి చేరుకోనున్నారు. ఉదయం ఆర్టీజీఎస్ సమీక్ష నిర్వహించనుండగా... మధ్యాహ్నం విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధి కార్యాచరణపై అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

