Amaravati: అమరావతిలోని సచివాలయం రాజకీయంగా ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు వరుసగా రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
పార్టీ సీనియర్ నేతలు రాయపాటి సాంబశివరావు, టీడీ జనార్ధన్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తో పాటు ఎంపీలు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, అదే సమయంలో కేంద్ర కేబినెట్ విస్తరణపై జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు మరింత ఆసక్తికరంగా మారాయి. సచివాలయంలోని సీఎంఓ వద్ద నేతల రాకపోకలు పెరగడంతో రాజకీయ వర్గాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో అధికార కూటమి వ్యూహాలపై చర్చ మొదలైంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీకి రెండు స్థానాలు దక్కే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో టికెట్ల కేటాయింపు, సామాజిక సమతుల్యత, రాజకీయ అనుభవం, పార్టీకి చేసిన సేవలు వంటి అంశాలు ప్రాధాన్యం పొందే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు కేంద్ర కేబినెట్ విస్తరణ కూడా చర్చనీయాంశంగా మారింది. కూటమి రాజకీయాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు మరింత ప్రాతినిధ్యం దక్కుతుందా? రాష్ట్రానికి చెందిన ఎంపీలకు కేంద్రంలో అవకాశాలు వస్తాయా? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికైతే ఇవన్నీ అధికారిక ప్రకటనలు కాకపోయినా, సీఎంఓలో కనిపిస్తున్న రాజకీయ కదలికలు మాత్రం రాబోయే రోజుల్లో కీలక పరిణామాలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యసభ స్థానాలు, కేంద్ర కేబినెట్ మార్పులు కలిసి ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపుతున్నాయి.

