Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Amaravati: సైబర్ నేరగాళ్లపై సీఎం చంద్రబాబు ఉక్కుపాదం

Amaravati: సైబర్ నేరగాళ్లపై సీఎం చంద్రబాబు ఉక్కుపాదం

hmtv 1 week ago

Amaravati: సైబర్ నేరగాళ్లపై సీఎం చంద్రబాబు ఉక్కుపాదం

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న సైబర్, ఆర్థిక నేరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా స్పందించారు.

సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సైబర్ మోసాల నియంత్రణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బాధితుల డబ్బు సైబర్ నేరగాళ్ల ఖాతాలకు పూర్తిగా చేరకముందే "గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీ" టెక్నాలజీలను సమర్థంగా ఉపయోగించాలని సీఎం స్పష్టం చేశారు. యూపీఐ ద్వారా క్షణాల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో వేగంగా స్పందించే వ్యవస్థ అత్యవసరమని పేర్కొన్నారు.

*మ్యూల్ అకౌంట్లపై ఏఐ టెక్నాలజీ*

నకిలీ ఖాతాల గుర్తింపుకు కొత్త టూల్స్ సైబర్ నేరాల్లో ఎక్కువగా "మ్యూల్ అకౌంట్లు" ఉపయోగిస్తున్నారని సమావేశంలో చర్చ జరిగింది. ఇతరుల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ అభివృద్ధి చేసిన "మ్యూల్ అకౌంట్ హంటర్ ఏఐ" వంటి టూల్స్‌ను వినియోగించి అనుమానాస్పద ఖాతాలను వెంటనే ఫ్లాగ్ చేయాలని సీఎం సూచించారు. బ్యాంకులు, పోలీసు శాఖ, ఐటీ విభాగాలు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే ఈ నేరాలను అడ్డుకోగలమని పేర్కొన్నారు.

*షెల్ కంపెనీలపై నిఘా*

ఆధార్, బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి కొంతమంది కేవైసీ లేకుండా, ఆధార్ ధృవీకరణ లేకుండా షెల్ కంపెనీలు ప్రారంభిస్తున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కంపెనీల ద్వారా భారీ ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందుకే ఆధార్ ఆథెంటికేషన్, బయోమెట్రిక్ ధృవీకరణ వ్యవస్థలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసాల విషయంలో స్పష్టమైన నియామావళి రూపొందించాలని ఆదేశించారు.

*ప్రజల్లో అవగాహన కీలకం*

ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌పై ప్రత్యేక హెచ్చరిక ఇటీవల ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టులు, ఫిషింగ్, విషింగ్ మోసాలు ఎక్కువవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు అధిక లాభాల ఆశతో మోసపోతున్నారని సీఎం పేర్కొన్నారు. అందుకే గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు సైబర్ అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని సూచించారు. ప్రతి బ్యాంకు, ప్రతి పోలీస్ స్టేషన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే విధానం ఉండాలని అన్నారు.

*ఏపీలో భారీ సైబర్ మోసాలు*

1930 హెల్ప్‌లైన్‌కు 9.29 లక్షల ఫిర్యాదులు సమీక్షలో డీజీపీ హరీష్ కుమార్ గుప్త కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు 9.29 లక్షల ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. సైబర్, ఆర్థిక మోసాల ద్వారా ఏపీ ప్రజలు రూ.652 కోట్ల వరకు నష్టపోయారని చెప్పారు. అయితే సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం బ్యాంకులతో కలిసి రూ.116 కోట్లకు పైగా నిధులను సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లకుండా నిలిపివేయగలిగిందని వెల్లడించారు.

*విజయవాడ, విశాఖ, తిరుపతిలో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్లు*

ప్రభుత్వ డేటాకు సైబర్ సెక్యూరిటీ రక్షణ రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణ కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ వెబ్‌సైట్లు, డేటా భద్రత కోసం "ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్" పని చేస్తోందని ఐటీ శాఖ వివరించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఉత్తమ సాంకేతిక విధానాలను అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని సీఎం సూచించారు.

*రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలకు సిద్ధం*

బ్యాంకులు-పోలీసులు కలిసి పనిచేయాలి సైబర్ నేరాలను అరికట్టడంలో బ్యాంకుల పాత్ర చాలా కీలకమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా వారాంతాల్లో జరిగే భారీ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక నిఘా పెట్టాలని బ్యాంకులకు సూచించారు. అవసరమైతే కొన్ని బ్యాంకింగ్ నిబంధనల మార్పుల కోసం రిజర్వ్ బ్యాంకును సంప్రదించాలని పేర్కొన్నారు. బాధితుల డబ్బు రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu