Anakapalli: అనకాపల్లి ఈవీఎం గోడౌన్ వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గోడౌన్ ను నెలవారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడ పరిస్థితులను గమనించారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, భద్రతా ప్రమాణాలపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తనిఖీ క్రమంలో లాగ్ బుక్ లో సంతకం చేశారు. భద్రతా ప్రమాణాలు, లాగ్ బుక్ నిర్వహణ ఇతర అంశాలపై అధికారులు మరియు నేతలతో మాట్లాడారు. భద్రపరిచిన ఈవీఎంల స్థితిగతులను జిల్లా కలెక్టర్ కు ఎన్నికల విభాగం అధికారులు వివరించారు వివిధ రాజకీయ పార్టీల నేతలతో డిఆర్ఓ వై. సత్యనారాయణ రావు సమీక్ష.
నెలవారీ సమావేశాలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం ఉదయం డిఆర్ఓ వై. సత్యనారాయణ రావు తన చాంబరులో ఎన్నికల జాబితా నవీకరణ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నీ ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు విషయంలో బూత్ లెవల్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని, ఎటువంటి పొరపాట్లకు తావులేని శుద్దమైన ఓటర్లజాబితా తయారీలో సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ వై సత్యనారాయణ రావు, ఆర్డిఓ ఆయేషా, జిల్లా ఫైర్ ఆఫీసర్, టి.డి.పి నుండి బి.శ్రీనివాసరావు, ఏ ఏ పి నుండి కే హరినాథ్ బాబు, బీఎస్పీ నుండి ఎస్.వి.వి.రామచందర్రావు, వైయస్సార్సీపి నుండి పి.గోవింద, సిపిఎం నుండి శ్రీరామ్, స్థానిక రెవెన్యూ, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

