Anantapur: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అసలైన లబ్ధిదారులకు మూడు నెలల్లోపు టిడ్కో ఇళ్లు ఇవ్వబోతున్నట్టు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు తెలిపారు.
అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కాలనీల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలపై ఎమ్మెల్యేకి అర్జీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరితో ఆయన ఓపిగ్గా మాట్లాడుతూ సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని సమస్యలపై అధికారులకు ఫోన్ చేసి వివరణ తీసుకున్నారు.
మరికొన్నింటి నిర్ణీత గడవులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బాధ్యతగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతి వారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో వచ్చే అర్జీలకు కచ్చితమైన పరిష్కారం చూపుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 42సార్లు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించామని.. వెయ్యికి పైగా సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు.
ఇందులో 954 సమస్యలకు పరిష్కారం చూపామని.. మిగిలిన వాటికి కూడా పరిష్కారం చూపుతున్నట్టు చెప్పారు. ఇందులో ఎక్కువగా పింఛన్లు, రేషన్ కార్డు, ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం అర్జీలు ఇచ్చారని.. వీటన్నింటనీ ఆన్ లైన్ చేశామని.. త్వరలోనే ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. 2014-19మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో 5వేల టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని పక్కన పెట్టేశారన్నారు. చాలా చోట్ల అవి దెబ్బతినే పరిస్థితి వచ్చిందన్నారు.
కొన్ని పెయింట్లు మార్చుకుని ఇది తమ గొప్ప అన్నట్టుగా చెప్పుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిని పూర్తి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో 2500ఇళ్లు పూర్తి చేశామని.. త్వరలోనే వాటిని లబ్ధిదారులకు ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 5లక్షల 50వేల మందికి ఇళ్లు నిర్మించామని.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఘతన అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు పేర్కొన్నారు.

