Anantapur: భూ సమస్యలకు చెక్ అనంతపురంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ!
అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన ప్రతి శుక్రవారం" ఒక నెల- ఒక నియోజకవర్గం- నాలుగు సందర్శనలు' కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో మొట్ట మొదటిసారిగా రాయదుర్గం మండలం 74 ఊడేగోళం గ్రామంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ లాంచనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక ఆర్డిటి కార్యాలయంలో నిర్వహించిన "ఒక నెల - ఒక నియోజకవర్గం- నాలుగు సందర్శనలు' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
భూ సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక పిజిఆర్ఎస్ చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రైతుల భూ సమస్యల పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, కళ్యాణదుర్గం డివిజన్ ఆర్డీవో వసంత బాబు, డి.ఎస్.పి రవిబాబు, తాసిల్దార్ హరికుమార్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

