Anantapur: ప్రశ్నిస్తే నోటీసులా? పోలీసులను నిలదీసిన తోపుదుర్తి
Anantapur: అనంతపురం జిల్లాలో హనీట్రాప్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ కోరినందుకు తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.హనీట్రాప్ ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమే అయినప్పటికీ, నిజం పూర్తిగా బయటపడాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాలో ఇసుక దందా, మట్కా, గంజాయి సరఫరా జరుగుతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కొంతమంది అమ్మాయిల ఫోటోలు, ఫోన్ నంబర్లను వాట్సాప్ ద్వారా పంపించి ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.అనంతపురం జిల్లాలో దొంగల రాజ్యం నడుస్తోందని విమర్శించారు.
దొంగలు పట్టుబడినప్పుడు పరిటాల శ్రీరామ్, సిద్ధార్థ పేర్లు చెబుతున్నారని అన్నారు.ప్రతిరోజూ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.ప్రశ్నించే గొంతును నొక్కడం పోలీస్ విధానం కాదని స్పష్టం చేశారు.ధర్మవరం ప్రాంతంలో పరిటాల శ్రీరామ్ ఎంత మొత్తంలో వసూళ్లు చేస్తున్నారో అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు.
హనీట్రాప్ కేసులో నిందితురాలు రంగమ్మను తరచూ ఎమ్మెల్యే సునీత తమ్ముడు మురళి, పరిటాల మహేంద్ర కలిసినట్లు వస్తున్న ఆరోపణలపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

