Dailyhunt
ANR Athreya song story:  ఏఎన్నార్‌కి కోపం...శ్రీదేవి కోసం ఆత్రేయ గేయం

ANR Athreya song story: ఏఎన్నార్‌కి కోపం...శ్రీదేవి కోసం ఆత్రేయ గేయం

hmtv 1 week ago

ANR Athreya song story: సినిమా రంగంలో క్రమశిక్షణకు మారుపేరు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. ఆయన సెట్స్‌లో ఉన్నారంటే గడియారం ముల్లు కంటే వేగంగా పని జరగాల్సిందే.

అలాంటి ఏఎన్నార్‌ను ఒకే ఒక్క పాట కోసం వారం రోజుల పాటు వేచి చూసేలా చేశారు 'మనసుకవి' ఆత్రేయ. 'శ్రీరంగనీతులు' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఈ ఆసక్తికర ఉదంతం గురించి దర్శకుడు కనగల జయకుమార్ పంచుకున్న విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్లాస్ హౌస్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్

అన్నపూర్ణ స్టూడియోలోని గ్లాస్ హౌస్‌లో 'శ్రీరంగనీతులు' మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు చక్రవర్తి అదిరిపోయే మాస్ ట్యూన్ ఇచ్చారు. దర్శకుడు కోదండరామిరెడ్డికి కూడా అది బాగా నచ్చింది. సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవితో కలిసి ఏఎన్నార్ స్టెప్పులు వేయాల్సిన పాట కావడంతో, ట్యూన్ చాలా జోరుగా ఉంది. కానీ, ఆ ట్యూన్‌కు సాహిత్యం అందించాల్సిన ఆత్రేయ కలం మాత్రం కదలడం లేదు.

ఏడు రోజుల నిరీక్షణ - ఏఎన్నార్ ఆగ్రహం

ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 7 రోజులు గడిచినా ఒక్క పల్లవి కూడా బయటకు రాలేదు. ఏఎన్నార్ ప్రతిరోజూ ఉదయాన్నే వచ్చి సిట్టింగ్‌లో కూర్చునేవారు. సమయాన్ని వృథా చేయడం ఇష్టం లేని ఆయనకు ఏడో రోజున సహనం నశించింది. "మీకు పాట రాయడం చేతకాదు, మీరు మద్రాస్ వెళ్ళిపోండి" అని ఆత్రేయపై కఠినంగా మాట్లాడేశారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఆ రాత్రి జరిగిన అద్భుతం

దర్శకుడు కోదండరామిరెడ్డి ఎలాగైనా పాట రాబట్టాలని ఆ రాత్రి ఆత్రేయ ఉంటున్న హోటల్ గదికి వెళ్లారు. ఆత్రేయ కాళ్ల మీద పడి బతిమిలాడారు. అప్పుడు ఆత్రేయ నవ్వుతూ.. "నేను రాస్తే అదిరిపోద్ది, రాయకపోతే నీకు అదిరిపోద్ది" అంటూ చమత్కరించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో, కనగల జయకుమార్‌ను పక్కన కూర్చోబెట్టుకుని శ్రీదేవి అందాన్ని వర్ణిస్తూ.. "నడుము ఓకే.. నడక ఓకే.. కళ్ళు ఓకే.. ఒళ్ళు ఓకే.."అనే అద్భుతమైన పల్లవిని అందించారు. ఆ పదాల్లోని ప్రాస, ఊపు చూసి మరుసటి రోజు ఏఎన్నార్ ఫిదా అయిపోయారు. అంతకుముందు తను కోప్పడిన విషయాన్ని మర్చిపోయి, ఆత్రేయ ప్రతిభను మనసారా అభినందించారు. సినిమా విడుదల తరువాత ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. క్లాసికల్‌ పాటలకు మారుపేరుగా ఉండే నాగేశ్వరరావు ఇలాంటి మాస్‌ పాటలో నటించడం బహుశా ఇదే మొదటిసారి. మాస్‌ పాటకు ఆయన వేసిన స్టెప్పులు ఫర్‌ఫెక్ట్‌గా సూటయ్యాయి. ఏ రచయిత అయినా సరే పాట బాగారావాలని ఆలోచిస్తారు. ఇక ఆత్రేయ వంటి వారు మరింత లోతుగా ఆలోచిస్తారు. అందుకే ఏడు రోజులపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఇలా వచ్చిన ఈ పాట నేటికీ యువతను ఉర్రూతలూగిస్తూనే ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu