Atmakur: ఆత్మకూరు అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్
Atmakur: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల పనితీరు విషయంలో నెల్లూరు జిల్లా ముందువరుసలో ఉండటం గర్వకారణమని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.శుక్రవారం ఉదయం ఆత్మకూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో పలు ప్రభుత్వ శాఖలపై మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ జిల్లాలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని, ఈ విషయంపై గౌరవ ముఖ్యమంత్రి ప్రశంసించడం జిల్లా అధికారులందరికీ గర్వకారణమన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. సీఎం ఇచ్చిన స్ఫూర్తితో జిల్లాలో అభివృద్ధిని మరింత హై స్పీడ్ పెంచాలని అధికారులకు మంత్రి పిలుపునిచ్చారు.సాగునీటి అంశాలపై సోమశిల, తెలుగు గంగ, నీటి పారుదల శాఖల పనితీరును సమీక్షించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కాలువల మరమ్మత్తులు, కొనసాగుతున్న పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌కు ముందే అన్ని పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని కాలువల పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సైక్లోన్ రిలీఫ్, ఎఫ్‌డీఆర్ గ్రాంట్ల కింద మంజూరైన పనులను వెంటనే వేగవంతం చేయాలని సూచించారు.
సోమశిల ప్రాజెక్టుకు సంబంధించిన ఉత్తర, దక్షిణ కాలువల పనుల్లో ఉన్న ఇబ్బందులను సమీక్షించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మైనర్, మీడియం ఇరిగేషన్ కింద రూ.3212 కోట్ల వ్యయంతో 440 పనులు మంజూరయ్యాయని, వాటిలో కొన్ని పూర్తయ్యాయని, మిగిలినవి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.త్రాగునీటి సరఫరా కోసం జలజీవన్ మిషన్ కింద రూ.6588 కోట్లతో 336 పనులు మంజూరై అమలులో ఉన్నాయని తెలిపారు. వేసవిలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సీపీడబ్ల్యూఎస్, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాల కింద ఉన్న స్కీములను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.36 కోట్లతో రహదారులు, డ్రైన్లు, అమృత్ పథకం కింద రక్షిత మంచినీటి పథకాల పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులు సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ప్రారంభమైన మాస్టర్ ప్లాన్ ప్రక్రియను ఇప్పుడు పూర్తి స్థాయిలో రూపొందించి నోటిఫికేషన్ కూడా పూర్తయ్యిందన్నారు. ఈ మాస్టర్ ప్లాన్‌ను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పంపించి భవిష్యత్ నిధులను తీసుకురావడమే లక్ష్యమన్నారు. ప్రస్తుతం 23 వార్డులు ఉన్న ఆత్మకూరు మున్సిపాలిటీని 28 వార్డులుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.
ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా నిధులు సమీకరించి సమగ్రంగా ఆత్మకూరు అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం అని మంత్రి ఆనం స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు,నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

