Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Atmakur: కొలను భారతికి అన్యాయం.. శ్రీశైల దేవస్థానం దత్తత ఉత్తుత్తేనా?

Atmakur: కొలను భారతికి అన్యాయం.. శ్రీశైల దేవస్థానం దత్తత ఉత్తుత్తేనా?

hmtv 1 week ago

Atmakur: కొలను భారతికి అన్యాయం.. శ్రీశైల దేవస్థానం దత్తత ఉత్తుత్తేనా?

ఆత్మకూరు: వేద కాలానికి పూర్వమే ఉన్న ఆలయం.. సప్త ఋషుల యాగాలు భగ్నం కాకుండా దివి నుంచి భువికి దిగివచ్చి స్వయంభుగా వెలసిన క్షేత్రం శ్రీ కొలనుభారతి సరస్వతి ఆలయం.

రావణ బ్రహ్మ రావణుడు అక్షరాభ్యాసం చేసిన క్షేత్రం.. దేవతల శిల్పి విశ్వకర్మ స్వయంగా రూపొందించిన ఆలయం.. అద్వైత ఆదిశంకరాచార్యులు నడయాడిన కోవెల.. చాళుక్యులు, కాకతీయులు, ఇక్ష్వాకులు, చోళులు దశలవారీగా అభివృద్ధి చేసిన ఇంతటి వేద , పురాణ, చారిత్రక విశేషాలతో నల్లమల లో వెలిసిన చదువుల తల్లి సరస్వతి ఆలయం కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల అరణ్యంలో శ్రీ చక్ర సమేతంగా స్వయంభుగా వెలసిన సరస్వతి దేవి క్షేత్రాన్ని ఊహించని అభివృద్ధి చేసి చూపిస్తామని ఐదు మాసాల క్రితం శ్రీశైల దేవస్థానం ఆర్భాటంగా దత్తత తీసుకుంది. దేవతలు కూడా ఊహించని భవిష్యత్ అభివృద్ధిని అరచేతిలో వైకుంఠంలా చూపిస్తామన్నారు .

ఆరు మాసాలు గడుస్తున్నా అత్తా పత్తా లేకుండా పోయారు. అనాధగా మిగిలిన అమ్మవారిని దత్తత తీసుకుని ఉద్ధరిస్తామన్న అధికారులు ఈ క్షేత్రం వైపు కనీసం తొక్కి చూడడం లేదు. 2016 కృష్ణ పుష్కరాల్లో ప్రభుత్వం రూ. 1.20 కోట్లతో నూతన ఆలయం, సప్త శివాలయాల నిర్మాణాలు ప్రారంభించారు. పది సంవత్సరాలు గడిచినా అడుగు అభివృద్ధి కూడా జరగలేదు. మరో రెండేళ్లలో మరోసారి కృష్ణ పుష్కరాలు రాబోతున్నాయి. దేవాదాయ శాఖకు క్షేత్రం నుంచి రూ. 24 లక్షలు జమ చేసింది. సర్వ శ్రేయో నిధి నుంచి రూ. 1.20 కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు ఇంకా పిలవలేదు. అయితే ఈ నిధులకు శ్రీశైల దేవస్థానానికి ఎలాంటి సంబంధం లేదు. మూడేళ్ల పాటు దత్తత తీసుకొని స్వయంగా ఐదు కోట్ల రూపాయల నిధులతో అత్యద్భుతంగా క్షేత్ర అభివృద్ధి చేసి చూపెడతామని అమ్మవారి సమక్షంలో హామీలు ఇచ్చిన శ్రీశైల దేవస్థానం అధికారులు ఎందుకు మౌనంగా ఉండిపోయారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

శ్రీశైల దేవస్థానం దత్తతతో కొలను భారతి సరస్వతి ఆలయం ధర్మకర్తల పాలకమండలి హోదాను కోల్పోయింది. చివరకు చీపురు కట్ట అవసరమున్నా శ్రీశైలం నుంచి రావాల్సిందే అన్న పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దపులుల అభయారణ్యం పరిధిలో ఉన్న ఈ క్షేత్రాన్ని శ్రీశైల దేవస్థానానికి దత్తత ఇచ్చేందుకు చక్రం తిప్పామని చెప్పుకుంటున్న నాయకులకు రహదారి నిర్మాణానికి కేంద్ర అటవీ శాఖ, ఎన్ టి సి ఏ నుంచి అనుమతులు తీసుకురావటం పెద్ద కష్టం కాదని ఇక మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. నవ్యాంధ్రలో ఉన్న ఏకైక సరస్వతి క్షేత్రం కొలనుభారతి ఆలయాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్న ప్రభుత్వాలు కొలను భారతి ఆలయాన్ని శ్రీశైల దేవస్థానానికి దత్తత క్షేత్రంగా అప్పగించి చేతులు దులుపుకోవడం పై .. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దత్తత తీసుకున్న తర్వాతనే కొలను భారతి క్షేత్రంలో సరస్వతి అమ్మవారు పూర్తి అనాధగా మార్చారని భక్తులు ఆవేదన చెందుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu