Atmakur: రూ.40 లక్షలతో ఆత్మకూరు టిడ్కోలో రామాలయం
నెల్లూరు: రాష్ట్రంలోని టిడ్కో కాలనీలకు రోల్ మోడల్‌గా నెల్లూరు జిల్లా ఆత్మకూరు టిడ్కో కాలనీలో నిర్మాణంలో ఉన్న రామాలయం నిలుస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.శుక్రవారం ఉదయం ఆత్మకూరు పట్టణం టిడ్కో కాలనీలో నిర్మిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అధికారులు, స్థానిక నేతలతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, శ్రీవాణి భజన మందిరాల్లో రాష్ట్రంలోని మొట్టమొదటి ఆలయంగా నిర్మాణం పూర్తి కావస్తున్న ఆత్మకూరు టిడ్కో కాలనీలోని రామాలయాన్ని త్వరలోనే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణచే ప్రారంభిస్తామని, ఆలయ నిర్మాణం తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో శ్రీకారం చూడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఐదువేలకు పైగా శ్రీవాణి భజన మందిరాలు ప్రతిపాదించగా వెయ్యికి పైగా ఆలయాలకు నిధులు మంజూరు చేసి పనులు మొదలు పెట్టినట్లు చెప్పారు.
10 లక్షలు నుంచి 40 లక్షల వరకు ఈ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మకూరులో రూ.40 లక్షల వ్యయంతో రామాలయ నిర్మాణాన్ని మంజూరు చేయగా, ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు 80 శాతం మేర పూర్తయినట్లు చెప్పారు.రామాలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సంబంధించిన పవిత్ర మొక్కలతో ప్రత్యేకంగా "నక్షత్రవనం" ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
పురాణాల గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక శోభతో, ప్రశాంత వాతావరణంతో తీర్చిదిద్దుతూ ప్రతి భక్తుడు ఆహ్లాదకర అనుభూతి పొందేలా అభివృద్ధి చేస్తున్నారు.ఆత్మకూరు నమూనాను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో కాలనీల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రామాలయాల నిర్మాణానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
పేదలు నివసించే టిడ్కో కాలనీల్లో ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా భక్తుల ఆకాంక్షల మేరకు ఆలయాల మంజూరుకు చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు.హిందూ ధర్మ వైభవం, సనాతన ధర్మ ఆచార వ్యవహారాలను పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరిలో భక్తి భావం, ధార్మిక చింతన పెంపొందించడమే లక్ష్యంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

