Report Cards: రిపోర్ట్ కార్డుకు అతీతంగా.. సమగ్ర మూల్యాంకనం ఎందుకు ముఖ్యం?
Beyond Report Cards: భారతదేశ విద్యా రంగంలో గత కొన్నేళ్లుగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరగడం, డిజిటల్ లెర్నింగ్ విస్తరించడం, జాతీయ విద్యా విధానం (NEP) 2020 ద్వారా కాన్సెప్ట్ ఆధారిత విద్య, సామర్థ్యాల అభివృద్ధి, సమగ్ర అభ్యసనకు ప్రాధాన్యత పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం మాత్రమే నిజమైన అభ్యసనకు కొలమానమా? వారు నేర్చుకున్న విషయాలను వాస్తవ జీవితంలో ఎంతవరకు ఉపయోగించగలుగుతున్నారన్నది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చాలా కాలంగా మన విద్యా వ్యవస్థలో పరీక్షలు విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసే ప్రధాన సాధనంగా ఉన్నాయి. పరీక్షలు ఇప్పటికీ అవసరమే అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో అవి విషయాలను గుర్తుపెట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా మారుతున్నాయి. దీంతో తార్కిక ఆలోచన, సమస్య పరిష్కారం, నేర్చుకున్న అంశాలను కొత్త పరిస్థితుల్లో అన్వయించడం వంటి నైపుణ్యాలు పూర్తిగా బయటపడకపోవచ్చు.
ఉదాహరణకు.. ఒక విద్యార్థి గణితంలో మంచి మార్కులు సాధించినప్పటికీ, అదే గణిత సూత్రాన్ని రోజువారీ జీవితంలోని ఒక సమస్యను పరిష్కరించడానికి ఉపయోగించడంలో ఇబ్బంది పడవచ్చు. అలాగే సైన్స్‌లో నిర్వచనాలను గుర్తుంచుకున్న విద్యార్థి.. వాటి వెనుక ఉన్న సూత్రాన్ని తన సొంత మాటల్లో వివరించలేకపోవచ్చు. ఇలాంటి అభ్యసన లోపాలు కేవలం మార్కుల ఆధారంగా నిర్వహించే మూల్యాంకనంలో ప్రతిసారీ స్పష్టంగా కనిపించకపోవచ్చు.
పరీక్షలకే పరిమితం కాకుండా మూల్యాంకనం
ఈ నేపథ్యంలో మూల్యాంకనాన్ని విద్యార్థి అభ్యసన ప్రక్రియలో ఒక భాగంగా చూడాల్సిన అవసరం ఉందని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. ప్రాజెక్టులు, కేస్ స్టడీలు, తరగతి గది చర్చలు, ప్రజెంటేషన్లు, ప్రాక్టికల్ యాక్టివిటీస్, సామర్థ్య ఆధారిత పరీక్షలు వంటి వివిధ విధానాలను ఉపయోగించడం ద్వారా విద్యార్థుల అసలు సామర్థ్యంపై మరింత స్పష్టత పొందవచ్చు.
ఇలాంటి విధానాలతో విద్యార్థికి ఏ అంశంపై అవగాహన ఉంది, నేర్చుకున్న విషయాలను ఎక్కడ అన్వయించగలుగుతున్నాడు, ఏ విభాగంలో అదనపు సహాయం అవసరం అనే విషయాలను ఉపాధ్యాయులు గుర్తించే అవకాశం ఉంటుంది.
నిరంతర మూల్యాంకనంతో ముందుగానే పరిష్కారం
విద్యార్థుల అభ్యసనలో ఏర్పడే అంతరాలను ముందుగానే గుర్తించడంలో నిరంతర మూల్యాంకనం కీలకంగా మారొచ్చు. విద్యా సంవత్సరం చివర్లో పరీక్ష నిర్వహించి సమస్యను గుర్తించే బదులు.. తరచూ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం ద్వారా విద్యార్థి ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రారంభ దశలోనే పరిష్కరించవచ్చు. దీంతో మూల్యాంకనం కేవలం మార్కులు ఇచ్చే ప్రక్రియగా కాకుండా.. అభ్యసనను మెరుగుపరిచే సాధనంగా మారుతుంది.
విద్యలో టెక్నాలజీ పాత్ర
డిజిటల్ అసెస్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లు, అడాప్టివ్ లెర్నింగ్ సిస్టమ్‌లు కూడా ఈ ప్రక్రియకు సహాయపడే అవకాశం ఉంది. విద్యార్థుల పనితీరుకు సంబంధించిన డేటాను విశ్లేషించడం ద్వారా వారికి ఏ అంశాల్లో అదనపు శిక్షణ అవసరమో గుర్తించవచ్చు. వ్యక్తిగత అభ్యసన అవసరాలకు అనుగుణంగా విద్యా సహాయాన్ని అందించేందుకు ఉపాధ్యాయులకు ఈ టెక్నాలజీ ఉపయోగపడొచ్చు.
అయితే సాంకేతికత ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రవర్తన, వారి సందేహాలు, చర్చల్లో పాల్గొనే విధానం వంటి అంశాలను ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా గమనించగలరు. విద్యార్థి పరిస్థితికి అనుగుణంగా వ్యక్తిగత ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంలోనూ ఉపాధ్యాయుల పాత్ర కీలకమే. అందువల్ల కొత్త మూల్యాంకన విధానాలతో పాటు ఉపాధ్యాయులకు తగిన శిక్షణ, వృత్తిపరమైన అభివృద్ధి కూడా అవసరం.
తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ముఖ్యం
విద్యార్థుల అభ్యసన విధానంపై తల్లిదండ్రుల ప్రభావం కూడా ఉంటుంది. పిల్లల విజయాన్ని కేవలం పరీక్షా మార్కులతోనే కొలిస్తే.. వారు కూడా చదువును మార్కులకే పరిమితం చేసే అవకాశం ఉంది. అందుకే పిల్లలను ప్రశ్నలు అడగడం, నేర్చుకున్న విషయాలను సొంత మాటల్లో వివరించడం, రోజువారీ సమస్యలకు పరిష్కారాలు ఆలోచించడం, పాఠ్యపుస్తకాలకు మించి కొత్త విషయాలను తెలుసుకోవడం వంటి అలవాట్లను తల్లిదండ్రులు ప్రోత్సహించవచ్చు.
భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు
కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, డేటా ఆధారిత సాంకేతికతల కారణంగా ఉద్యోగ రంగం వేగంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కేవలం పుస్తక జ్ఞానం సరిపోదని నిపుణులు భావిస్తున్నారు. విశ్లేషణాత్మక ఆలోచన, కమ్యూనికేషన్, టీమ్‌వర్క్, సమస్య పరిష్కారం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేర్చుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలు కూడా కీలకంగా మారుతున్నాయి.
NEP 2020లోనూ సామర్థ్య ఆధారిత విద్య, అనుభవపూర్వక అభ్యసనం, సమగ్ర మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విధానాలను తరగతి గది స్థాయిలో సమర్థంగా అమలు చేయడమే ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది. పాఠ్యప్రణాళిక మార్పులు, ఉపాధ్యాయుల శిక్షణ, మూల్యాంకన విధానాలు సమన్వయంతో ముందుకు సాగినప్పుడే విద్యార్థులకు విస్తృతమైన అభ్యసన అనుభవం అందే అవకాశం ఉంటుంది.
అందువల్ల పరీక్షలను పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. అయితే పరీక్షలు విద్యార్థి అభ్యసనాన్ని అంచనా వేసే విస్తృత వ్యవస్థలో ఒక భాగంగా ఉండాలి. విద్యార్థులు కేవలం సమాచారాన్ని గుర్తుంచుకుని పరీక్షలు రాయడం కాకుండా.. విషయాన్ని అర్థం చేసుకోవడం, ఆలోచించడం, నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించడం, సమస్యలను పరిష్కరించడం, తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించడం వంటి సామర్థ్యాలను కూడా పెంపొందించుకోవడమే విద్యా వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా ఉండాలని 'TestKart' వ్యవస్థాపకుడు, CEO అభిప్రాయపడ్డారు.

