Burning Topic: అమెరికా - క్యూబా మధ్య యుద్ధ మేఘాలు
Burning Topic: మొన్న వెనెజువెలా.. నిన్న ఇరాన్.. రేపు క్యూబా.. డొనాల్డ్ ట్రంప్ వార్ క్యాలెండర్ ఇదేనా?
తాను ఎన్నో యుద్ధాలను ఆపినా నోబెల్ ఫ్రైజ్ రాలేదని తరచూ వాపోతారు అమెరికా అధ్యక్షుడు. మరోవైపు తానే ప్రపంచ దేశాల మీద యుద్ధానికి కాలు దువ్వుతున్నారు. ఈ ఏడాది జనవరి మాసంలో వెనెజువెలా మీద దాడి చేసి అధ్యక్షుడు మదురోను నిర్బంధించిన అమెరికా.. ఫిబ్రవరి నెలాఖరి ఇరాన్ మీద దాడులు చేసి సుప్రీంలీడర్ అలీ ఖమేనీని హతమార్చడం తెలిసిందే. ఇప్పుడు అగ్రరాజ్యం తదుపరి లక్ష్యం క్యూబానే అని స్పష్టమైపోయింది. ఈ విషయాన్ని కొద్ది వారాల క్రితం స్వయంగా ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం మనం ఇరాన్ పనిని పూర్తి చేయాలనుకుంటున్నాం.. అది అయిపోయాక క్యూబా వంతు వస్తుంది అని చెప్పేశారు.. క్యూబా మీద ఇప్పటికే అనేక ఆంక్షలను కొనసాగిస్తున్నా దారికి రావడం లేదని చిటపటలాడుతున్నారు ట్రంప్. తాజాగా క్యూబాకు విముక్తిని కల్పిస్తున్నాం అని ప్రకటించారు.
తాజా నాటకీయ పరిణామాల నేపథ్యంలో 1996 ఫిబ్రవరి 24 నాటి అమెరికా పౌర విమానాల కూల్చివేత కేసులో క్యూబా మాజీ అధ్యక్షుడు 94 ఏళ్ల రౌల్ కాస్ట్రోపై అమెరికాలోని ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ ఘటన జరిగిన కాలంలో రౌల్ కాస్ట్రో క్యూబా రక్షణ మంత్రిగా ఉన్నారు. మయామి కేంద్రంగా పనిచేసే బ్రదర్స్ టు ది రెస్క్యూ అనే సంస్థ క్యూబా నుంచి శరణార్థి సంస్థ కొందరు వ్యక్తులను విమానంలో తీసుకుపోతోంది. ఈ విమానం అంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తుండగా క్యూబాకు చెందిన మిగ్ యుద్ధ విమానాలు వాటిపై దాడి చేసి కూల్చివేశాయి. ఆ విమానంలోని ప్రయాణీకుల్లో నలుగురు చనిపోగా అందులో ముగ్గురు అమెరికన్లు ఉన్నారు. ఆయుధాలు లేని పౌర విమానాలకు ముందస్తు హెచ్చరికలు చేయకుండానే దాడి చేయడం ద్వారా అంతర్జాతీయ విమానయాన రక్షణ చట్టాలను నాటి క్యూబా రక్షణ మంత్రిగా ఉన్న రౌల్ కాస్ట్రో ఉల్లంఘించారని అమెరికా న్యాయశాఖ చార్జ్‌షీట్‌లో ఆరోపించింది.
క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోపై నేరారోపణల నమోదుకు అమెరికాలోని మియామిలో ఉన్న ఒక ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ 2026 ఏప్రిల్ 23 నాడే ఆమోదం తెలిపింది. ఈ చారిత్రక నేరారోపణ వివరాలను అమెరికా న్యాయశాఖ 2026 మే 20న అధికారికంగా బహిరంగపర్చిన వెంటనే, క్యూబాకు విముక్తిని కల్పిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.మేం క్యూబా గురించి చాలా ముఖ్యమైన ఆలోచనతో ఉన్నాం. ఇది కేవలం క్యూబన్ అమెరికన్లకే కాకుండా, క్యూబా నుంచి అమెరికాకు వచ్చి తమ కుటుంబాల్ని చూడాలి అనుకుంటున్న ప్రజలకు కూడా ఒక గొప్ప సందర్భం. క్యూబా పతనమవుతున్న దేశం. వాళ్ల దగ్గర చమురు లేదు. మేం అక్కడి కుటుంబాలకు, ప్రజలకు సహాయం చేయడానికి ఉన్నాం. మానవతా దృక్పథంతో, మేం సహాయం చేస్తాం. క్యూబాలో ఎలాంటి ఉద్రిక్తతలు ఉండవు. వాళ్లు నిజంగా క్యూబాపై నియంత్రణ కోల్పోయారు అంటూ చెప్పుకొచ్చారు ట్రంప్.
30 ఏళ్ల కిందట హత్యకు గురైన నలుగురు అమెరికన్ల కుటుంబాలు ఇప్పటికి న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయన్నారుఅమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె.. వారు సాధరణ పౌరులు. వారి వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. శరణార్థులను కాపాడానికి వెళ్లిన మా పౌరులను పొట్టన పెట్టుకున్నారు. అందులో రావుల్ కాస్ట్రోది కీలక పాత్ర. అతడి అరెస్ట్ కోసం త్వరలోనే ఒక వారెంట్ జారీ చేస్తాం. కాబట్టి అతడు తనంతట తాను అమెరికాకు వస్తాడని ఆశిస్తున్నాము. లేకపోతే ఇతర మార్గాల్లో మేమే రప్పిస్తామని" ఆయన పేర్కొన్నారు.
ఈ చార్జ్‌షీట్ విడుదలైన కొద్ది గంటల్లోనే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో క్యూబా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. క్యూబాను కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న కాస్ట్రో కుటుంబ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అక్కడి ప్రజలకు పిలుపు నిచ్చారు. రూబియోకు క్యూబా మూలాలు ఉండటం విశేషం.

