Burning Topic: అన్నామలై కొత్త పార్టీ? బీజేపీకి బిగ్ షాక్?
Burning Topic: జూన్ 3న ఏం జరగబోతోంది? దీనిపై తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
జూన్ నాలుగో తేదీన తమిళనాడు రాజకీయాల్లో సంచలన నేతగా గుర్తింపు తెచ్చుకున్న కుప్పుస్వామి అన్నామలై పుట్టిన రోజు.. అంతము ముందు రోజు ఆయన మీడియా ముందు సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఏమిటా ప్రకటన? బీజేపీలో తన రాజకీయ భవిష్యత్తు విషయంలో కొంతకాలంగా ఆలోచన చేస్తున్న అన్నామలై రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కలుసుకునేందుకు ఆపాయింట్‌మెంట్ కోరారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ఈ చర్చలు విఫలమైతే, జూన్ 3న అన్నామలై పార్టీ వీడటం ఖాయమని ప్రచారం జరుగుతోంది దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే విస్తృత చర్చ జరుగుతోంది.
అసలు ఈ ప్రచారం అంతటికీ కారణం జూన్ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజును సందర్భంగా ఆయన మద్దతుదారులు, అభిమానులు కోయంబత్తూరు నగరంలో పెద్దఎత్తున పోస్టర్లను వేయడం. 'మా నాయకుడా. ముందుండి నడిపించు అన్న నినాదంతో కోయంబత్తూరు మాజీ మేయర్ ఉత్తమ్ బాలాజీ రామస్వామికి చెందిన ఉత్తమ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నగరమంతటా అన్నామలైకు మద్దతుగా భారీ పోస్టర్లను అతికించారు. సింగనల్లూరు, అవినాశి రోడ్డుతో పాటు నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వాటిపై అన్నామలై చిత్రాలతో పాటు.. 'మా నాయకా, ముందుకొచ్చి నాయకత్వం వహించండి..రా.. నాయకత్వం వహించు' అనే నినాదాలను ముద్రించడం చర్చకు దారి తీసింది. అన్నామలై తమిళనాడు వ్యాప్తంగా యువతను, తన లాంటి ఆలోచన కల్గిన వ్యక్తులను ఏకం చేస్తూ.. 'మక్కల్ శక్తి ఇయక్కం' పేరుతో సరికొత్త సామాజిక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.
అన్నామలై అతి చిన్న వయసులోనే ఐపీఎస్‌ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. 1984 జూన్ 4న తమిళనాడు కరూర్ జిల్లా, తొట్టంపట్టి గ్రామంలో జన్మించారాయన. మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ తరువాత లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 2011 సంవత్సరంలో ఐపీఎస్‌కి సెలక్ట్ అయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో చిక్కమగళూరు, ఉడిపి జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌గా, బెంగళూరులో డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా పని చేశారు. ఆ సమయంలో తన ముక్కుసూటితనంతో నాయకులను, సంఘ విద్రోహశక్తులను హడలగొట్టి సింగంగా పేరు తెచ్చుకున్నారు. కాగా అన్నామలై అతి కొద్ది కాలమే ఐపీఎస్ అధికారిగా పని చేసి 2019లో పదవీ విరమణ తీసుకున్నారు. ఈ తర్వాత అన్నామలై 2020 ఆగష్టు 25న బీజేపీలో చేరడం, 2021లో తమిళనాడు బీజేపీ శాఖకు అధ్యక్షుడు కావడం జరిగిపోయాయి.
అన్నామలై బీజేపీకి నాయకత్వం వహించగానే క్షేత్రస్థాయిలో తమిళనాడు బీజేపీకి ఒక సరికొత్త ఊపును, దూకుడును తీసుకొచ్చారు. ఆయన దూకుడు శైలి, మీడియాలో ఆయనకున్న ఆదరణ కారణంగా ఢిల్లీలోని అగ్రనాయకత్వం కూడా ఆయన మాటలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో పోటీ చేసిన బీజేపీ నాలుగు నియోజకవర్గాల్లో గెలిచింది. అయితే
ఆయన అనుసరించిన అతి దూకుడు రాజకీయ వ్యూహాలు రివర్స్ అయ్యాయి. సీఎన్ అన్నాదురై, జె జయలలితలపై అన్నామలై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇది బీజేపీ సుదీర్ఘ మిత్ర పక్షమైన ఏఐఏడీఎంకేను తీవ్రంగా నొప్పించింది. ఫలితంగా ఇరు పార్టీల మధ్య కూటమి బంధం తెగిపోయింది.2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే లేకుండా బీజేపీ విడిగా ఎన్నికలు ఎదుర్కొంది. ఎక్కడా విజయం సాధించకపోయినా కోయంబత్తూర్ తదితర పలుచోట్ల అన్నాడీఎంకేను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ, ఏఐఏడీఎంకేలు తమ కూటమిని పునరుద్ధరించుకోవాలని నిర్ణయించారు. అయితే ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి బీజేపీ ముందు ఒక షరతు పెట్టారు. తమిళనాడు బీజేపీ నాయకత్వాన్ని మార్చితేనే తాము కూటమిలోకి వస్తామన్నారు. దీంతో బీజేపీ అధిష్ఠానం అన్నామలై స్థానంలో నైనార్ నాగేంద్రన్‌ను నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని వదులుకున్నా పార్టీకి అంకిత భావంతో పని చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయిప్పటికీ రాష్ట్రమంతా తిరిగి బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. కాగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో జోడీకట్టిన భాజపా 27 చోట్ల పోటీ చేయగా స్వల్ప ఓట్ల తేడాతో ఊటీలో మాత్రమే విజయం సాధించింది. పార్టీ ముఖ్య నేతలు దారుణంగా ఓడిపోయారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 11.24 శాతంగా ఉన్న భాజపా ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో 2.97కి తగ్గింది.
అన్నామలై ఆ పరిణామాలను మందుగానే ఊహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని చెప్పారు. బీజేపీ కనీసం కనీసం 500 రోజుల ముందు 234 నియోజకవర్గాలకు అభ్యర్థులను పరిచయం చేస్తే తిరుగులేని శక్తిగా మారుతుందని మాట్లాడిన వీడియోను ఆయన మద్దతుదారులు వైరల్ చేశారు. అన్నామలైని అధ్యక్ష పదవిని నుంచి తొలగించడం వల్లే బీజేపీ ఎదుగుదలకు బ్రేక్ పడిందని చెబుతున్నారు. యువతలో ఆకర్షణ కారణంగానే టీవీకే పార్టీ ఘన విజయం ద్వారా తమిళనాట ద్రావిడ పార్టీల పాలనకు విజయ్ ముగింపు పలికారని అంటున్నారు
అన్నాడీఎంకే, డీఎంకేలో యువతను ఆకర్షించే నేతలు లేరని.. అన్నామలై అధ్యక్షునిగా ఉంటే బీజేపీ పరిస్థతి వేరుగా ఉండేదనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో విజయ్‌ని ఎదుర్కొనే శక్తి అన్నామలైకే ఉందని, ఆయనకు తిరిగి కీలక బాధ్యతలు అప్పగించాలని బీజేపీ మద్దతుదారుల నుండి డిమాండ్ కూడా వచ్చింది
కాగా ఇటీవల బీజేపీ కేంద్ర నాయకత్వానికి, అన్నామలైకి మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరగుతోంది. ఇటీవల సీబీఎస్ఈ 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రతిపాదించిన 'మూడు భాషల విధానం' అమలు విషయంలో ఆయన కేంద్రంతో విబేధించారు.తమిళనాడులో ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అనవసరమైన మానసిక ఒత్తిడి పెరుగుతుందని అన్నామలై భావించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వెళ్లగక్కారు. కేంద్ర ప్రభుత్వంతో వచ్చిన కొన్ని సిద్ధాంతపరమైన విభేదాల నేపథ్యంలో అన్నామలై తమిళనాడులో ఒక సరికొత్త సామాజిక, రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే 'మక్కల్ శక్తి ఇయక్కం' అంటే ప్రజా శక్తి ఉద్యమం పేరుతో సరికొత్త వేదికను ప్రజల ముందుకు తీసుకురాబోతున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ ఇది నిజమేనా అనేది తెలియాలి అంటే జూన్ 3 వరకూ ఆగాల్సిందే.

