Burning Topic: ఇరాన్ మీద యుద్ధం వెనుక అసలు కారణం ఇదే?
Burning Topic: ఇరాన్‌తో యుద్ధమా? లేక శాంతి ఒప్పందమా? అనే విషయం తేలడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని, ఇరాన్ నుంచి తమకు 100 శాతం సానుకూల సమాధానాలు కావాలన్నారు.
ఇరాన్ సరిగా స్పందించని పక్షంలో తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. . ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఎంతో సమయం, శక్తి, మరికొందరి ప్రాణాలు కాపాడినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. ఎక్కువ మంది చనిపోవడం కంటే, తక్కువ నష్టంతో ఈ సమస్య ముగిసిపోవాలన్నదే తన కోరికని, అయితే తాము ఏ దారిలో వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో ఇరాన్‌కు మాత్రం అణ్వాయుధాన్ని సాధించే అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతకుముందు గల్ఫ్‌దేశాల విజ్ఞప్తితోనే ఇరాన్‌పై సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ ప్రకటించడం తెలిసిందే..
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య విబేధాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు కొనసాగించాలా లేక సైనిక చర్యలకు దిగాలా అనే అంశంపై ఇద్దరు నాయకులు గంట పాటు ఫోన్ ద్వారా చర్చించుకున్నారు. అమెరికా ప్రతిపాదించిన 'ఆపరేషన్ స్లెడ్జ్‌హామర్' దాడులను గల్ఫ్ మిత్రదేశాల కోరిక మేరకు ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ట్రంప్ ఈ కాల్‌లో తెలిపారు ఈ చర్చల తర్వాత నెతన్యాహు తీవ్ర ఆగ్రహానికి, ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఖతార్, పాకిస్తాన్ దేశాలు ప్రతిపాదించి, సవరించిన శాంతి ఒప్పందంపై ట్రంప్ మొగ్గు చూపుతుండగా, నెతన్యాహు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ కేవలం కాలయాపన కోసమే ఈ చర్చలను వాడుకుంటోందని, సైనిక దాడులను ఆపడం చారిత్రక తప్పిదమని నెతన్యాహు వాదించారు. అయితే, 'మంచి ఒప్పందమైనా కుదురుతుంది లేదా గట్టి చర్యలైనా ఉంటాయి' అని ట్రంప్ స్పష్టం చేశారు.
మరోవైపు అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిపై తన నియంత్రణను మరింత బలోపేతం చేస్తూ దీవుల వద్ద చెక్‌పాయింట్‌లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నౌకలపై రుసుములు విధిస్తోంది. జలసంధిలో ఇరాన్ సరికొత్తగా పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ ఏర్పాటు చేసింది. నౌకలపై ట్రాన్సిట్ అనుమతులు జారీ చేసి, రుసుములు వసూలు చేస్తోంది. ముఖ్యంగా టోల్ ఫీజులు వసూలు చేయడం, నౌకల కార్గో వివరాలు, జెండా, గమ్యం వంటి సమాచారం సేకరించడం వంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని నౌకలకు రెండు మిలియన్ డాలర్ల వరకు టోల్ ఫీజులు విధిస్తున్నారు. దీని ద్వారా ఇరాన్ 10 బిలియన్ డాలర్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఇరాన్ ఈ సంస్థ ద్వారా హార్మూజ్ జలసంధిపై తన భౌగోళిక ప్రభావాన్ని పెంచుకోవడం, ఆర్థిక లాభం పొందడం, అమెరికా ఆంక్షలను తప్పించుకోవాలని ప్రణాళిక తయారు చేసింది
ఇదిలా ఉంటే అసలు ఇరాన్ మీద అమెరికా-ఇజ్రాయెల్ చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అసలు ఉద్దేశం వేరే అని తెలుస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలు, క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేయడం ఈ దాడికి కారణమని అమెరికా చెబుతోంది. అయితే వెనెజువెలా తరహాలో ఇరాన్‌లో కూడా నాయకత్వ మార్పు కోసమే ఈ దాడులు జరిగాయని 'ది న్యూయార్క్ టైమ్స్' కథనం చెబుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత, ఆ దేశ పాలకుడిగా తమకు అనుకూలమైన అతివాద నేత, మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీ నెజాద్‌ను తిరిగి తీసుకురావాలని అమెరికా-ఇజ్రాయెల్ భావించాయి. ఈ క్రమంలో ఆయనతో సంప్రదింపులు కూడా జరిగాయి. ఈ ప్రణాళిక ప్రకారమే 28న అలీ ఖమేనీని హత్య చేసిన తర్వాత ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని అహ్మదీ నెజాద్ఇంటిపై కూడా దాడి జరిగింది. అయితే నాటి ఘటనలో నెజాద్ ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో అమెరికా ప్రయత్నం విఫలమైనట్లు తెలుస్తోంది.

